
సుగుణారెడ్డికి రెడ్‌క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్‌క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్‌క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్‌క్రాస్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేస్తున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అత్యధిక స్థాయిలో ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు.
విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి
సీతానగరం: చినకొండేపూడిలో నివాసం ఉంటున్న పోలవరం ప్రాజెక్టు ఉద్యోగి అంకిత్ కటియార్ (34) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడని ఎస్సై డి.రామ్‌కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టులో ఫీల్డ్ ఇంజినీర్‌గా ఉత్తరప్రదేశ్‌లోని బెహత్ జిల్లా లాల్‌పూర్ జమల్‌పురానికి చెందిన అంకిత్ కటియార్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్న తన భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. తర్వాత బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో సహ ఉద్యోగి వచ్చి చూడగా అంకిత్ మృతి చెంది ఉన్నాడు. చేతిలో చిన్న ఫ్యాన్‌కు విద్యుత్ రావడంతో షాక్‌కు గురై మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహ ఉద్యోగి గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్‌కుమార్ తెలిపారు.
అక్కాచెల్లెళ్ల అదృశ్యం
రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్‌బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.