
ఏటీఎం మార్చేసి.. సొమ్ము డ్రా చేసి
యానాం: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన ఓ విశ్రాంత పోలీసు అధికారినే మోసం చేసిన ఘటనలో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. యానాం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్–2 కట్టా సుబ్బరాజు కథనం ప్రకారం.. గత నెల 28న యానాం పిల్లారాయ వీధిలో ఎస్‌బీఐ ఎటీఎం నుంచి విశ్రాంత పోలీసు అధికారి సత్యనారాయణ రూ.10 వేలు డ్రా చేశారు. అయితే మినీ స్టేట్‌మెంట్ రాకపోవడంతో పక్కనే ఉన్న పిఠాపురం వద్ద నరసింగపురానికి చెందిన కాసీబు రాంబాబును మినిస్టేట్‌మెంట్ తీయమని అడిగి పిన్ నంబరు చెప్పారు. మినీ స్టేట్‌మెంట్ రావడం లేదని చెప్పి రాంబాబు తన వద్ద ఉన్న మరో కార్డును సత్యనారాయణకు ఇచ్చాడు. అనంతరం రాంబాబు బయటకు వెళ్లి ఆ ఏటీఎం కార్డు నుంచి రూ.70 వేలు తస్కరించాడు. జరిగిన మోసంపై సత్యనారాయణ యానాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యానాం క్రైమ్ టీమ్ సభ్యులు జాంటీ, దుర్గారావు, మల్లాడి గణేష్‌లు నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని రూ.వెయ్యి నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై దువ్వాడ, కాకినాడ ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయి.