
చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి నామవరంలోని ఒక ఇంట్లో చోరీ చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ వివరాలు మీడియాకు ఆయన బుధవారం తెలిపారు. నామవరానికి చెందిన రేలంగి లోవరాజు ఈ నెల 2న ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలసి తలుపులమ్మ లోవకు వెళ్లారు. దానిని గమనించి నిందితులు రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన నలబా సత్యనారాయణ అనే సత్తిబాబు (32), బెదంపూడి రత్నరాజు అనే నాని (20), ఇనకోటి పవన్‌కుమార్ (20)లు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 22 కాసుల బంగారు నగలు, రూ. 1.75 లక్షలు దొంగించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తమ సిబ్బందితో దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన తరువాత నగదులో కొంత తమ విలాసాలకు వాడుకున్నారు. నిందితుల నుంచి 22 కాసుల బంగారు నగలతోపాటు రూ. 1.15 నగదును స్వాధీనపర్చుకున్నారు.