సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం

Jul 8 2025 5:06 AM | Updated on Jul 8 2025 9:22 AM

-

 ‘తూర్పు’ మదిలో మహానేత జాడలు పదిలం

 జిల్లా అభివృద్ధిలో డాక్టర్‌ వైఎస్సార్‌ది కీలక భూమిక

 ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట

సాగునీటి ప్రాజెక్టులతో మెట్ట రైతుకు మేలు

 ఆరోగ్యశ్రీతో వేలాది మందికి ఊపిరి

 నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి

 సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అభాగ్యులకు అండ

మహానేత వైఎస్సార్‌ ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచారు. 2004కు ముందు నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే వృద్ధాప్య పింఛను ఇచ్చేవారు. దీనిని వైఎస్సార్‌ ఒకేసారి రూ.200కు పెంచారు. దివ్యాంగ పింఛనును రూ.500కు పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తన పాలనా కాలంలో ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు ఒక్కసారి కూడా పెంచకుండా ఆయన చర్యలు తీసుకున్నారు.

నేల విడిచి సాము చేస్తూ.. హైటెక్‌ మాయాలోకంలో ముంచేస్తూ.. అదే అంతిమ లక్ష్యమనే భ్రమలు కల్పిస్తూ.. 70 శాతం ప్రజలు జీవిస్తున్న పల్లెలను విస్మరించేలా.. ప్రశ్నించిన వారిని అణచివేసేలా దుర్మార్గమైన పరిపాలన సాగిన రోజులవి. ఎటు చూసినా కరవు. ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం ఉండేది కాదు. విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు గ్రామీణులకు అందని దుస్థితి. అంతటా ‘ప్రైవేటు’ తంత్రమే.. సంక్షేమ విస్మరణే. ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా సొమ్ము ఇచ్చుకోవాల్సిందే..అటువంటి దుర్భర పరిస్థితుల్లో.. అణగారిన జనం కోసం నేనున్నానంటూ ఆ మహనీయుడు భరోసా ఇచ్చారు. నిరుపేదల గుండెసడిగా.. కష్టజీవులకు కొండంత అండగా నిలిచారు.. పాతాళానికి పయనిస్తున్న రాజకీయ విలువలకు.. ప్రజలకు దూరమవుతున్న ప్రభుత్వ పాలనకు పగ్గాలు వేశారు. జనం బాటలోకి మళ్లించారు. పరిపాలనకు మానవత్వాన్ని జోడించారు. పండుటాకులకు పెద్ద కొడుకుగా.. రైతుజనబాంధవుడిగా.. అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో ఆరోగ్యప్రదాతగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో విద్యా ప్రదాతగా నిలిచారు. ‘అన్నా.. కష్టమొచ్చింది’ అంటూ ఎవరైనా వస్తే కరిగిపోతూ.. వారికి భరోసాగా నిలిచారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ పెద్ద పీట వేశారు. ఆ జనబాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముద్ర ఎప్పటికీ చెరగనిది. తన పరిపాలనా కాలం 2004–09 మధ్య ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. విద్య, వైద్యం, పరిశ్రమలతో పాటు దేశానికి వెన్నుదన్నుగా నిలిచే వ్యవసాయ రంగాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు అవిశ్రాంత కృషి చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మండు వేసవిని సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. నాడు స్వయంగా గుర్తించిన సమస్యలకు అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపారు. ఆ మహానేత నేడు భౌతికంగా లేకపోయినా.. ఆయన సేవలను జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మహనీయుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

అభివృద్ధి జాడలివిగో..

● విజయవాడ – విశాఖపట్నం మధ్య దూరాన్ని తగ్గించేందుకు.. ఈ నగరాల మధ్య రాకపోకలు మరింత వేగవంతమయ్యేందుకు.. వైఎస్సార్‌ హయాంలో 2006లో రూ.800 కోట్లతో గోదావరి నదిపై నాలుగు వరుసల్లో గామన్‌ బ్రిడ్జి, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 14 కిలోమీటర్ల మేర అప్రోచ్‌ రోడ్డు, 4.5 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో విశాఖ – విజయవాడ మధ్య దూరం సుమారు 40 కిలోమీటర్లు తగ్గింది.

● అత్యధిక అనుంబంధ కళాశాలలతో రాష్ట్రంలోనే అతి పెద్దదిగా ఎదిగిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009లో శంకుస్థాపన చేశారు. నాడు ఆయన శ్రీకారం చుట్టిన ఈ విశ్వవిద్యాలయం నేడు వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది.

● రాజమహేంద్రవరం నగరంలోని మురుగు నీటిని నేరుగా కాకుండా శుద్ధి చేసి గోదావరిలోకి వదిలేందుకు హుకుంపేట పంచాయతీ పరిధిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ) నిర్మాణం చేపట్టారు.

● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నేషనల్‌ అకడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (న్యాక్‌) భవనం నిర్మాణాన్ని సుమారు రూ.22 కోట్లతో వైఎస్‌ హయాంలోనే చేపట్టారు. ప్రస్తుతం ఆ భవనమే జిల్లా కలెక్టరేట్‌గా సైతం సేవలందిస్తూండటం విశేషం.

● నిడదవోలు పట్టణానికి 2005లో వచ్చిన నాటి సీఎం వైఎస్సార్‌ సుమారు రూ.కోటితో రోడ్లు, డ్రై న్ల నిర్మాణం చేపట్టారు. మరో రూ.కోటితో సెంట్రల్‌ విద్యుత్‌ లైటింగ్‌, విద్యానగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. బాలాజీ నగర్‌లో రూ.1.64 కోట్లతో నిర్మించిన 500 కిలోలీటర్ల మంచినీటి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 28వ వార్డు శివారున 832 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించారు. రూ.70 లక్షలతో నూతన మునిసిపల్‌ కార్యాలయం నిర్మించారు.

రైతు బాంధవుడిగా..

వ్యవసాయం దండగ అని పేర్కొంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా చితికిపోయారు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు సానుకూల విధానాల ద్వారా వ్యవసాయాన్ని తిరిగి పండగ చేశారు. అన్నదాతలకు మేలు చేసేలా ఎన్నో పనులు, పథకాలు చేపట్టారు. పావలా వడ్డీ రుణాలు, రుణమాఫీతో వెన్నుదన్నుగా నిలిచారు. కాడి వదిలిన కర్షకుడు మళ్లీ కాడి పట్టేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

● బ్రాహ్మణగూడెంలో రూ.2.73 కోట్లు పైగా వెచ్చించి 1,200 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తద్వారా 600 ఎకరాల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపారు.

● తాళ్లపూడి మండలంలో 4,950 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.8.59 కోట్లతో పైడిమెట్ల ఎత్తిపోతల పథకం నిర్మించారు.

● రూ.3.60 కోట్లు పైగా వ్యయంతో చాగల్లులో ఎత్తిపోతల పథకం నిర్మించారు.

● 16 మండలాల్లో 2,06,600 ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లతో చేపట్టారు.

● కొవ్వాడ కాలువ వరద ముంపు నివారణకు రూ.56 కోట్లతో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ నిర్మించారు. దీనివలన కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని 15 వేల ఎకరాలకు వరద ముంపు సమస్య తీరింది.

● పోలవరం ప్రాజెక్టులో ఎక్కువ పనులను వైఎస్సార్‌ హయాంలోనే పూర్తి చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులూ తీసుకువచ్చారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలు తవ్వించారు.

● మెట్ట రైతులకు మేలు చేయాలనే తలంపుతో గోదావరి నదిపై తాడిపూడి సమీపాన చింతపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు కృషి చేశారు.

● రూ.15.26 కోట్లతో కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి మండలాల్లోని 4,950 ఎకరాలకు సాగునీరు అందించే ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.

● కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని రూ.1.75 కోట్లతో పునరుద్ధరించారు.

● వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. దీని ద్వారా మెట్ట ప్రాంత రైతులకు ఎంతో మేలు జరిగింది. నీరు పుష్కలంగా లభించడంతో రైతులు ఇబ్బడిముబ్బడిగా పంటలు పండించారు. దీంతో వ్యవసాయ దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. దేశవిదేశాల్లో ఎంతో పేరొందిన కడియం నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్‌ సరఫరా అందించారు.

నీటి విలువ తెలిసిన నేత వైఎస్సార్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాం స్వర్ణయుగం. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. రైతుబాంధవుడిగా ఖ్యాతి గడించారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ అనంతరం నీటి విలువ తెలిసిన నేతగా వైఎస్సార్‌ ఖ్యాతి గడించారు. ఉచిత విద్యుత్‌ ఇచ్చి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసిన నేత ఆయన. మెట్ట రైతులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించిన మహనీయుడు. ఆరోగ్యశ్రీతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అంతటి మహానేత జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యాన భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. కొవ్వూరులో భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తాం.

– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జిపై పాదయాత్ర

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దేశ, రాష్ట్ర రాజకీయాలను పెను మలుపు తిప్పింది. నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పాదయాత్ర రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఆ సమయంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో వైఎస్సార్‌ కొంతమూరు వద్ద అస్వస్థతకు గురయ్యారు. అక్కడే అరగంట పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్ర కొనసాగించారు. అనంతరం మధురపూడిలోని విమానాశ్రయం ఎదురుగా ఉన్న తోటలో ఆరు రోజుల పాటు వైద్య సేవలు పొందారు. ఆ సందర్భంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు ఆయనను కలుసుకున్నారు.

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం 1
1/4

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం 2
2/4

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం 3
3/4

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం 4
4/4

సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement