
మడిలో.. సందడి
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు వివరాలు (హెక్టార్లలో)
సాధారణ సాగు విస్తీర్ణం 76,941
నారుమడుల లక్ష్యం 3,847
ఇప్పటి వరకూ వేసిన నారుమడులు 2,122
ఇంకా వేయాల్సిన విస్తీర్ణం 1,725
నాట్లు వేసిన విస్తీర్ణం 1,339
● జోరందుకుంటున్న ఖరీఫ్ సాగు
● నారుమడులు, నాట్లలో రైతులు బిజీ
దేవరపల్లి: చాలా మంది రైతులకు ప్రభుత్వం రబీ ధాన్యం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. అన్నదాతా సుఖీభవ పథకం కింద ఇస్తామన్న పెట్టుబడి సాయం అందించలేదు. ఈవిధంగా పుట్టెడు కష్టాల్లో మునిగి తేలుతున్నా.. పుడమిని పిండి పసిడి గింజలు పండించడం తప్ప మరో పని తెలియని అన్నదాతలు.. అప్పోసొప్పో చేసి మరీ ‘సాగు’దారిలోనే ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కాలువలకూ నీరు విడుదలైంది. దీంతో, జిల్లావ్యాప్తంగా రైతన్నలు మడిలో హడావుడి పడుతున్నారు. ఫలితంగా ఖరీఫ్ సాగు పనులు క్రమంగా జోరందుకుంటున్నాయి. పుష్కలంగా నీరు లభిస్తున్న మడుల్లోను, చెరువుల కింద ఆకుమడులు వేస్తున్నారు. దమ్ములు చేస్తున్న రైతులు భూసారం పెంచేందుకు ఇప్పటికే వేసిన జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను భూమిలో కలియదున్నుతున్నారు. బోర్ల కింద ముందస్తుగా ఆకుమడులు వేసిన కొంత మంది ఇరవై రోజులుగా వరి నాట్లు కూడా ప్రారంభించారు. వర్షాలకు చెరువుల్లో నీరు చేరడంతో చెరువుల కింద భూముల్లోని రైతులు దంప ఆకుమడులు, నారు సిద్ధంగా వారు నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ 356 హెక్టార్లలో నేరుగా పంట వేయగా, 966 హెక్టార్లలో దమ్ము చేసి నాట్లు వేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 43 వేల మంది రైతులతో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మరికొంత మంది రైతులు వంగ, బెండ, టమాటా, మిర్చి, సొర, దోస వంటి కూరగాయ పంటల సాగుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి అవసరమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్‌లో సుమారు 3,200 హెక్లార్లలో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు.
బెంగాలీ కూలీల సందడి
ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో పలు ప్రాంతాల్లోని పొలాల్లో బెంగాలీ కూలీలు సందడి చేస్తున్నారు. వారు ఒక క్రమ పద్ధతిలో నాట్లు వేయడం వలన దుబ్బు బాగుంటుందని, పంట బాగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయని రైతులు అంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సుమారు 2 వేల మంది బెంగాలీ కూలీలు వచ్చినట్లు చెబుతున్నారు. వీరితో ఎకరం పొలంలో నాట్లు వేయడానికి రూ.3,500 వరకూ ఖర్చవుతుందని రైతులు తెలిపారు.
ప్రారంభమైన వరి నాట్లు
జిల్లాలో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. తొలుత బోర్ల కింద ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువలు, చెరువుల కింద ఆకుమడులు వేసి, నాట్లకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నాట్లు ఈ నెలాఖరుకు ఊపందుకోనున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఆగస్టు నెలాఖరుకు దాదాపు పూర్తవుతాయి. ఖరీఫ్‌లో 3,847 హెక్టార్లలో వరి ఆకుమడులు అవసరం కాగా, ఇప్పటి వరకూ 2,122 హెక్టార్లలో వేశారు. మిగిలినవి చెరువుల కింద వేయాల్సి ఉంది. వేసిన ఆకుమడులు ఆరోగ్యకరంగా ఉన్నాయి.
– ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం
సేంద్రియ ఉత్పత్తుల పట్ల ఆసక్తి
సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీంతో, ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడంతో పాటు పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. వరితో పాటు కొబ్బరి, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహిస్తున్నాం.
– బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్,
ప్రకృతి వ్యవసాయం విభాగం, రాజమహేంద్రవరం

మడిలో.. సందడి

మడిలో.. సందడి