
నేడే పట్టాభిషేకం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదివినవారికి గుర్తింపుగా యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్‌టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి వర్సిటీ ఆహ్వానాలు పంపింది. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పట్టా (ఒరిజనల్ డిగ్రీ) తీసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. జీవితంలో మధురానుభూతిగా నిలిచే ఈ వేడుకలకు అర్హులైనవారు తమ వివరాలు వర్సిటీకు పంపించారు. గత ఏడాది డిసెంబర్‌లో స్నాతకోత్సవం నోటిఫికేషన్ జారీ చేసి గవర్నర్ అనుమతితో శుక్రవారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 11వ స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా 2023–24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలు అందజేస్తున్నారు. బీటెక్ విభాగంలో 41,258, బిఫార్మశీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1115, ఎంఫార్మశీ 458, బీబీఏ 115, ఫార్మడీ 274, బీఆర్క్ 83 ఓడీ (ఒరిజనల్ డిగ్రీ)లు విద్యార్థులు పొందనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు 40మందికి, పీహెచ్‌డీలు 99 మందికి అందజేయనున్నట్టు వర్సిటీ వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు.
పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు
గౌరవ డాక్టరేట్..
స్నాతకోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థి, అమెరికా బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన జేఎన్‌టీయూ కాకినాడ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1986లో అమెరికాలో బోస్టన్ గ్రూప్ స్థాపించి సుమారు 2,500 మందికి యూఎస్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించి మలేషియా, ఇండోనేషియా, ఫిలిఫిన్స్ వంటి దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించే విధంగా జేఎన్‌టీయూకేలో సుబుకోటా ఫౌండేషన్ స్థాపించి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ప్రతి ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులకు పోటీలు నిర్వహిహించి నగదు బహుమతితో ప్రొత్సహిస్తున్నారు.
జేఎన్‌టీయూకే 11వ స్నాతకోత్సవం
వర్సిటీ కులపతి,
గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు

నేడే పట్టాభిషేకం