
సమర్థవంతంగా నేరాల కట్టడి
● పోలీసు అధికారులు, సిబ్బంది సహకారం భేష్
● ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
● నేర సమీక్షలో ఎస్పీ నరసింహ కిశోర్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో నేరాలను సమర్థంగా అరికట్టగలుగుతున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అర్థ సంవత్సర నేర సమీక్ష నిర్వహించారు. 2025లో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసులు ఛేదించిన కేసులు, సాధించిన విజయాలను చర్చించారు. కేసుల దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కట్టడి చేయాలన్నారు. ఈ సమీక్షలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని, రాబోయే ఆరు నెలలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.