
మహిళపై దాడి
8 మందిపై కేసు నమోదు
ధవళేశ్వరం: ఇంటి తగాదాకు సంబంధించి మహిళపై దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ టి.గణేష్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ కాలనీలో తిరుకోటి పావని అనే మహిళ పేరుపై బిల్డింగ్ ఉంది. ఈ ఇల్లు తనదేనంటూ కొత్తూరు పార్వతి అనే మహిళ పేర్కొనడంతో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. మంగళవారం కొందరు ఇనుప రాడ్లతో ఇంటికి వచ్చి తనపై దాడి చేయడంతో గాయపడినట్లు పావని ఫిర్యాదు చేసింది. పావని ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఐదుగురు మహిళలు, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్ తెలిపారు.
మన్నించు మహాత్మా..
గాంధీజీ విగ్రహం చేయి ధ్వంసం
రాజానగరం: గాంధీజీ విగ్రహాన్ని ఆకతాయిలు ధ్వంసం చేశారు. గాంధీ బొమ్మ కూడలిగా పేరొందిన ఈ ప్రాంతం నిత్యం రద్దీతో ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో మాత్రం తాగుబోతులకు ఆలవాలంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు, ఎందుకు కారకులయ్యారో గానీ మహాత్ముని కుడి చేతిని విరగొట్టారు. ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆగస్టు 15కి, అక్టోబరు 2న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు పోటీపడుతుంటారు. రెండు నెలలుగా మొండి చేతితో ఉన్న మహాత్ముని విగ్రహం వారెవరి దృష్టిలో పడకపోవడం విచిత్రం.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
గండేపల్లి: మల్లేపల్లి హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన గుండు అమ్మాజీ గ్రామంలో సచివాలయం–2 వద్ద జరిగే వారపు సంతలోకి నిత్యావసర వస్తువుల కోసం రోడ్డు దాటుతోంది. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి సుమారు మూడేళ్ల పాపతో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఆర్.దొరబాబు ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడి రోడ్డుకు మధ్యలో పడ్డ వీరిని స్థానికులు పక్కకు తీసుకువచ్చి సపర్యలు అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు అంటున్నారు. మూడేళ్ల పాపకి ఏమైందోనని పలువురు కలవరపాటుకు గురయ్యారు. ఆ చిన్నారి బయాందోళనకు గురికావడంతో గ్రామానికి చెందిన యువకుడిని మోటార్ సైకిలిస్టుకు తోడుగా వెంట పంపించారు. సంతకు వచ్చిన వాహనాలు రోడ్డుకు పక్కనే పార్కుచేయడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం వారపు సంత రోజైనా పోలీస్ సిబ్బందిని ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మహిళపై దాడి