
సెంటు భూమి కూడా లేకపోయినా..
రాయుడు గిరిజ, శివప్రసాద్ దంపతులది కరప మండలం వేళంగి. వీరికిద్దరు పిల్లలు. వారికి తల్లికి వందనం కింద ఒకేసారి రూ.30 వేలు వస్తుందని ఆ దంపతులు సంబరపడ్డారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఉండటానికి ఇల్లు తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా లేని ఈ కుటుంబానికి యండమూరులో సర్వే నంబర్ 509/2లో 1.4850, 505/1లో 9.810తో కలిపి మొత్తం 11.295 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా ఈ కుటుంబం తల్లికి వందనానికి దూరమూంది. దీనిపై యండమూరు వీఆర్‌ఓ, కరప తహసీల్దార్లను కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నారు. సమస్య ఇప్పటికీ పరిష్కారమవలేదు. తమ పేరున ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తల్లికి వందనమైనా ఇవ్వాలని, లేదంటే ఆ భూములైనా ఇప్పించాలని వారు అడగటంలో తప్పేముందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.