
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే అన్ని కేటగిరిలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 కు దరఖాస్తు చేసుకునే పక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. ప్రతిపాదనలు నేషనల్ అవార్ట్స్ టు టీచర్స్.ఎడ్యుకేషన్.గవ్.ఇన్/లాగిన్.ఎస్‌పీఎక్స్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం
పథకానికి ఆమోదం
రాజమహేంద్రవరం రూరల్: భారత ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం(ఈఎల్‌ఐ) పథకానికి ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) రీజనల్ పీఎఫ్ కమిషనర్–2 కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన పీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థిరమైన ఉపాధి కల్పన, ఆర్థిక చేయూతను ప్రోత్సహించేందుకు ఈఎల్‌ఐ పథకం రూపొందించారన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి 2027 జూలై 31మధ్య సృష్టించిన ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. యజమానుల ప్రోత్సాహక చెల్లింపులు పాన్–లింక్డ్ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామన్నారు.
భీమేశ్వరాలయం నుంచి
తలుపులమ్మకు సారె
రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ అమ్మవారికి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆషాఢం సారెను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని బుధవారం సమర్పించారు. లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమేశ్వరాలయ అర్చకుడు మద్దిరాల రాజ్‌కుమార్‌శర్మ, చండీ పారాయణదారులు జుత్తుక చిన్న, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం