
జీజీహెచ్..
అనాథ రోగులకు ప్రత్యేకంగా ఐడీ వార్డు
చేర్చేందుకు మానవత్వమే అర్హత
డాక్యుమెంట్లతో పని లేదు
కంటికి రెప్పలా కాచుకునే సిబ్బంది
కాకినాడ క్రైం: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎందరో అనాథలు, అభాగ్యులు మన కంట పడతారు. వయసుతో తారతమ్యం లేకుండా అనారోగ్యంతోనో.. కదల్లేని అచేతన స్థితిలోనో కొందరుంటే, మానసిక ఆరోగ్యం క్షీణించి ఒంటిపై ఆచ్ఛాదన కూడా లేని దీనావస్థలో ఇంకొందరు తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని చూసి అయ్యో అనుకుంటాం. వారి దయనీయతని చూసి జాలిపడతాం. చేసేదేం లేక పండో, పదో చేతిలో పెట్టి నిట్టూరుస్తాం. చలించిపోయిన మనసుకి సర్దిచెప్పుకొని బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి బయల్దేరతాం. ఓ మారు వారినీ చూడు దేవుడా.. అంటూ మనసులో స్మరిస్తూ ఇంకెవరితోనో ఆ విషయాన్ని పంచుకొని దిగులు చెందుతాం. ఎక్కడ పుట్టారో.. ఎలా పెరిగారో.. ఎలా జీవించారో.. ఎంత ఉన్నతులో.. ఎంత పేదవారో.. ఎవరి ఆదరణకు నోచుకోక రోడ్డున పడ్డారో ఏవీ తెలియని ఎందరో ప్రాణాలు అసంపూర్తిగా తెల్లారిపోతుంటాయి.
మనసులో తడి ఉన్న వారికి సమాజంలో కొదవు లేదు. అభాగ్యులై రోడ్ల వెంట అగమ్యగోచరంగా తిరిగే వారిని చూసి అయ్యో అని వదిలేయకుండా ఏదో చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఆర్థిక, కుటుంబ, సామాజిక పరిస్థితుల రీత్యా ఏమీ చేయలేని అసమర్ధత. సామాజిక బాధ్యతగా భావించి ఏదో ఒకటి చేయాలనే వారికోసం కాకినాడ ధర్మాస్పత్రి బాసటగా నిలుస్తోంది. వారు ఎవరినైనా అభాగ్యులను తీసుకువస్తే చేర్చుకునేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఐడీ (ఇన్ఫెక్ట్యయస్ డిసీజెస్) వార్డుగా నామకరణం చేసింది.
జీజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డు
జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ఈ వార్డునే ఐసోలేషన్ వార్డు లేదా అనాథల వార్డు అని పిలుస్తారు. ఇక్కడ ఎనిమిది పడకలు, గాలి కోసం ఆరు ఫ్యాన్లు ఉంటాయి. పారిశుద్ధ్య సిబ్బంది, ఓ ఎంఎన్‌వో, ఓ ఎఫ్‌ఎన్‌వో రోగులను సంరక్షిస్తుంటారు. ఇద్దరు నర్సులు 24 గంటల పాటు నిరంతరాయంగా సేవలు అందిస్తారు. తరచుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రతి రోజు పీజీ వైద్యులు వార్డుకు వచ్చి రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంటారు.
మానవత్వం చాలు
అనాథ, శారీరక, మానసిక అనారోగ్య బాధితులు, కుటుంబ సభ్యులు వదిలేసిన దీనులు, రోడ్లపై గాయాలు, పుండ్లతో ఉన్న ఒంటర్లు, గర్భం దాల్చి రోడ్లపై సంచరిస్తున్న అనాథ మహిళలు. బిడ్డలు వదిలేయగా ఇంట్లో మగ్గిపోతున్న అనారోగ్య బాధిత వృద్ధులు. తీవ్ర అనారోగ్యాలతో భిక్షాటన చేస్తున్న వారు, ఇలా ఎవరూ లేని, అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు ఎవరినైనా ఐడీ వార్డులో చేర్చవచ్చు. వీరిని చేర్చేందుకు సామాజిక బాధ్యత, మానవత్వం ఉంటే చాలు. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. ఆరోగ్య శ్రీ కార్డులే కాదు, కనీసం ఆధార్ కార్డుతో కూడా పనిలేదు. ప్రాంతం, కులం, ఆర్థిక స్థితిగతులను తెలిపే ఎటువంటి పత్రాలు అవసరం లేదు. ఆ మాటకొస్తే కనీసం బాధితుడి పేరు తెలియక పోయినా ఈ వార్డులో చేర్చుకుంటారు. చికిత్సలో ఉన్నంత వరకు వీరి సంరక్షణను ఆస్పత్రి చూసుకుంటుంది.
అద్దంలా ఐడీ వార్డు
అభాగ్యుల వార్డు కదా.. అధ్వానంగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఈ వార్డు నిర్వహణ గమనిస్తే ఫ్లోర్లు కూడా అద్దంలా మెరిసిపోతుంటాయి. నిత్యం మూడు పూటలా ముగ్గురు సిబ్బంది ఐడీ వార్డును శుభ్రపరుస్తారు. ఫినాయిల్, సోప్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్లు, టస్కీ స్ప్రేలు, లెమన్ గ్రాస్ ఆయిల్‌ను ఇందుకు వాడతారు. దోమల నివారణకు మలాథియాన్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. కిటికీలన్నీ మెష్‌లతో మూసి ఉంచుతారు. ప్రతి వారం బూజులు దులుపుతారు. మేన్‌మేడ్ ఫ్లోర్ స్క్రబ్బింగ్ డ్రై అండ్ వెట్ మాబ్ యంత్రంతో వార్డును శుభ్రంగా ఉంచుతారు.
దాతలూ.. దయ చూపండి
అనారోగ్యాలతో బతుకీడుస్తున్న అనాథల కోసం దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ రోగులకు పండ్లు, వస్త్రాలు సమకూర్చాలనుకునే వారు జీజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవోను 89192 61612 నంబరులో సంప్రదించవచ్చు. తాము చేయాలనుకున్న సేవా కార్యక్రమాన్ని నివేదించి అనుమతులు పొంది అనారోగ్య పీడిత అనాథల సేవలో తరించవచ్చు.
సిబ్బంది కాదు.. సేవకులు
రోగులను ఆప్యాయంగా చూసుకునే సొంతిల్లు వంటిది ఐడీ వార్డు. అక్కడి సిబ్బంది సేవా దృక్పథంతో రోగులను కంటికి రెప్పలా చూసుకుంటారు. మూడు పూటలా రోగులకు పోషకాహారం అందిస్తున్నాం. పారిశుధ్య నిర్వహణ, వార్డులను పరిశుభ్రంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దడం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. వైద్య సేవల అనంతరం కోలుకున్న వారిని అనాథాశ్రమాలు, ప్రభుత్వ సామాజిక వసతి గృహాలకు సిఫార్సు చేస్తాం. అనారోగ్యంతో ఉన్న అనాథ రోగుల పట్ల ప్రజలు మానవత్వంతో వ్యవహరించి కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురావాలి. అత్యవసర విభాగంలో చేర్చి వైద్యుల సిఫార్సు మేరకు, ఐడీ వార్డు సహాయం కోసం అక్కడ నర్సులను సంప్రదించాలి.
– డాక్టర్ లావణ్యకుమారి,సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ
అమ్మలా నర్సు
ఐడీ వార్డులో అనాథ రోగులు చిన్నపిల్లల్ని మించి యాతన పెడుతుంటారు. సేవలు అందించే వారికి చుక్కలు చూపిస్తారు. వైద్యానికి ఏ మాత్రం సహకరించరు. అటువంటి స్థితిలో ఉన్నవారికి వడ్డి ఇమ్మి అనే స్టాఫ్ నర్సు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యం. అక్కడి రోగులందరూ ఆమెను సొంత మనిషిలా భావిస్తారు. నిస్సత్తువ ఆవహించి తడబడిన మాటలతో వారు పిలిచే అమ్మా అనే పిలుపు ఆమెకు వెయ్యి ఏనుగుల బలాన్నిస్తుంది. ఆమె సేవలను అక్కడి వైద్య, వైద్యేతర సిబ్బందితో పాటు వార్డును సందర్శించే అధికారులు, స్వచ్ఛంద సేవకులు ఎంతగానో గొప్పగా చెప్తుంటారు. కటకం నాగమణి అనే మరో నర్సు ఆమె అందిస్తున్న సేవల్లో పాలుపంచుకుని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.
కన్నబిడ్డల్లా సాకుతున్నారు
ఐడీ వార్డులో రోగులు మలమూత్రాలన్నీ మంచం మీదే. అటువంటి వారి పక్కనూ.. వారినీ శుభ్రం చేస్తూ తన కన్న బిడ్డల్లా చూసుకుంటున్న పారిశుధ్య కార్మికుడు మీసాల ప్రభాకర్. కదల్లేని వారికి మంచం మీద.. నడవగలిగే వారిని మరుగుదొడ్లకు తీసుకువెళ్లి శుభ్రం చేసి తీసుకువస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. శరీరం నిండా పుండ్లు, నిస్సత్తువతో ఉండే రోగుల ఆరోగ్య స్థితి మెరుగయ్యేందుకు నిత్యం రెండు సార్లు స్నానం చేయించి సపర్యలు చేస్తున్న ఎంఎన్‌వో చింతపల్లి వీరబాబు సేవలు సైతం చెప్పుకోదగ్గవే.

జీజీహెచ్..

జీజీహెచ్..

జీజీహెచ్..

జీజీహెచ్..

జీజీహెచ్..