
చిగురిస్తున్న ఆశలు
కదలని లో గ్రేడ్ పొగాకు బేళ్లు
లో గ్రేడ్ పొగాకు అడిగే నాథుడు లేక రైతుల ఇళ్ల వద్ద నిల్వలు కదలని పరిస్థితి కనిపిస్తోంది. ఏటా 15 నుంచి 20 శాతం లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తి అవుతుంది. ఈ రకానికి గత రెండేళ్లూ మార్కెట్లో డిమాండ్ ఏర్పడి, ట్రేడర్లు అధిక ధరకు కొనుగోలు చేశారు. గత ఏడాది మార్కెట్లో లో గ్రేడ్ పొగాకు కిలో రూ.270 పలికింది. ఈ ఏడాది ఇంత వరకూ లో గ్రేడ్ పొగాకును ట్రేడర్లు కొనుగోలు చేయలేదు. గత ఏడాది కొనుగోలు చేసిన లో గ్రేడ్ పొగాకు నిల్వలు సుమారు 10 మిలియన్ల కిలోలు ఇంకా ఆయా కంపెనీల వద్ద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రకం పొగాకును కొన్ని కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. ఈ ఏడాది 10 నుంచి 15 శాతం లో గ్రేడ్ పొగాకు పండినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు.
ఫ మరింత పెరిగిన పొగాకు ధర
ఫ కిలోకు గరిష్టంగా రూ.300కు చేరిక
ఫ ఇప్పటి వరకూ రూ.642.93 కోట్ల
పొగాకు కొనుగోళ్లు
దేవరపల్లి: వారం రోజులుగా ధర స్వల్పంగా పెరుగుతూండటంతో పొగాకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 22 వరకూ కిలో గరిష్ట ధర రూ.290 ఉండగా, 24న రూ.290, 25న రూ.291, 26న రూ.293, 27న రూ.296 వరకూ పెరిగి, శనివారం ఏకంగా రూ.300కు చేరింది. సగటు ధర కూడా స్వల్పంగా పెరగడంతో మార్కెట్‌పై రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేలం కేంద్రాలకు బేళ్లు తక్కువగా తెస్తున్నారు. వేలానికి రోజుకు 5 వేల నుంచి 6,400 వరకూ బేళ్లు రాగా, రెండు రోజుల నుంచి ఆ సంఖ్య తగ్గింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌లోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలకు శనివారం 4,396 బేళ్లు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 2,616 బేళ్లు కొనుగోలు చేయగా, 1780 బేళ్లు అమ్ముడుపోలేదని వివరించారు. ఒకవేళ ముందుముందు ధర పెరిగితే ఇప్పుడు అమ్ముకుంటే నష్టపోతామని రైతులు అంటున్నారు. ఏటా ముందుగా అమ్ముకుంటున్న రైతులు నష్టపోతూండగా, చివరిలో అమ్ముకుంటున్న వారు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
23.53 మిలియన్ల కిలోల కొనుగోలు
రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి 77 రోజుల పాటు వేలం నిర్వహించారు. ఇప్పటి వరకూ రూ.642.93 కోట్ల విలువైన 23.53 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దీనిలో ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్) పొగాకు 22.48 మిలియన్ల కిలోలు, బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు 10,45,242 కిలోలు ఉందని బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు కిలోకు రూ.275.03, బీఎస్ పొగాకుకు రూ.236.95 చొప్పున సగటు ధర లభించింది. శనివారం నాటికి ఐదు వేలం కేంద్రాల్లో మొత్తం 1,82,703 బేళ్లు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు 1,75,025 బేళ్లు, బ్లాక్ సాయిల్ బేళ్లు 7,678 ఉన్నాయి. కిలోకు గరిష్టంగా రూ.300, కనిష్టంగా రూ.220, సగటున రూ.273.24 చొప్పున ధర లభించినట్టు ప్రసాద్ వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 7.31 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 7.87, జంగారెడ్డిగూడెం–2లో 7.42, కొయ్యలగూడెంలో 6.64, గోపాలపురం వేలం కేంద్రంలో 7.76 మిలియన్ల కిలోల చొప్పున విక్రయాలు జరిగాయని తెలిపారు.