
పుంజుకుంటున్న పొగాకు మార్కెట్
● కాస్త పెరిగిన ధర
● కిలోకు గరిష్టంగా రూ.296
● కనిష్టంగా రూ.220
దేవరపల్లి: పొగాకు మార్కెట్ నెమ్మదిగా పుంజుకుంటోంది. మూడు రోజులుగా ధర స్వల్పంగా పెరుగుతూండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అంతర్జాతీయంగా మన పొగాకుకు ఎగుమతి ఆర్డర్లు ఖరారు కావడంతో మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ ఏర్పడినట్టు సమాచారం. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు మూడు నెలలు కాగా, 75 రోజుల పాటు వేలం జరిగింది. దాదాపు 72 రోజుల పాటు ధరలు నిలకడగా కొనసాగడంతో రైతులు దిగులు చెందారు. ముఖ్యంగా కౌలు రైతులు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో మూడు రోజులుగా మార్కెట్లో ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23న కిలో గరిష్ట ధర రూ.290 ఉండగా, 24న రూ.291, 25న రూ.293కు పెరిగి, గురువారం రూ.296కు చేరింది. దీంతో పాటు కొనుగోళ్లలో పురోగతి కనిపించడంతో ముందు ముందు మార్కెట్ ఆశాజనకంగా ఉండవచ్చునని రైతులు భావిస్తున్నారు. మూడు రోజుల్లో కిలోకు గరిష్టంగా రూ.6 పెరుగుదల కనిపించింది. ఎక్స్ గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు పోటీ పడటంతో ధరలో పెరుగుదల వచ్చిందని అధికారులు అంటున్నారు. లో గ్రేడ్, మీడియం గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతో ఆయా గ్రేడ్‌ల పొగాకు నిల్వలు రైతుల వద్దనే ఉన్నాయి. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల నుంచి గురువారం 3,983 బేళ్లు వేలానికి రాగా, ట్రేడర్లు 2,681 బేళ్లు కొనుగోలు చేశారు. 1,302 బేళ్లను తిరస్కరించారు. 3,40,934 కిలోల పొగాకు విక్రయం జరిగింది. ధర స్వల్పంగా పెరిగినప్పటికీ వేలం కేంద్రాలకు వచ్చిన బేళ్లు తక్కువగానే ఉన్నాయి. మంగళవారం 6,560, బుధవారం 5,516 చొప్పున బేళ్లు వేలానికి వచ్చాయి. గురువారం ఆ సంఖ్య 3,983గా ఉందని అధికారులు తెలిపారు. వేలానికి వస్తున్న బేళ్లలో 40 శాతం అమ్ముడవక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రేడర్లు కొనుగోలు చేయకపోవడంతో తీసుకు వచ్చిన బేళ్లు తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి నానా అవస్థలూ పడుతున్నారు. బేలుకు దూరాన్ని బట్టి సుమారు రూ.200 నుంచి రూ.300 వరకూ రవాణా ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ధర స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని బేళ్లకు మాత్రమే ఈ రేటు వస్తోందని రైతులు తెలిపారు.
వేలం కేంద్రాల వారీగా కిలో పొగాకు ధరలు (రూ.)
వేలం కేంద్రం గరిష్ట సగటు
దేవరపల్లి 295.00 250.00
జంగారెడ్డిగూడెం–1 295.00 281.00
జంగారెడ్డిగూడెం–2 296.00 273.00
కొయ్యలగూడెం 296.00 268.00
గోపాలపురం 294.00 268.00