ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
కొత్తపల్లి: ఊరు వెళ్లిన సమయంలో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాకతిప్ప విద్యుత్ ఉపకేంద్రం ఎదురుగా ఉన్న కాలనీకి చెందిన పేరూరి శ్రీనివాసరావు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. సోమవారం కుటుంబ సమేతంగా అన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నట్టు బుధవారం వారి ఇరుగుపొరుగు వారు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆయన ఇంటికి చేరకుని, చోరీ జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో బీరువాలో పెట్టిన 12 కాసుల బంగారం, అర కిలో వెండి వస్తువులు, సుమారు రూ.1.30 లక్షల నగదు చోరీకి గురైనట్టు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై వెంకటేష్ క్లూస్ టీంతో పరిశీలించారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. దొంగలు ఆ ఇంటికి అమర్చి ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వసం చేసినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


