ఈసారి ప్రజలకే వెన్నుపోటు పొడిచారు
రాజమహేంద్రవరం రూరల్: మొదట పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌కు, తరువాత సహచర పార్టీలకు, ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏకంగా ప్రజలకే వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దీనిని నిరసిస్తూ బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి, అధికారులకు ప్రజల వాణి వినిపిస్తామని చెప్పారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వందలకొద్దీ హామీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదని, నైతికత లేని పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం చేయలేని ప్రతి పనినీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పారు కాబట్టి చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, నిజాలు చెప్పారు కాబట్టి జగన్ నిబద్ధతతో పని చేశారని అన్నారు. వైఎస్ జగన్ అప్పులు చేశారంటూ ఎన్నికలకు ముందు బాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిని నమ్మిన ప్రజలు అధికారం ఇస్తే ఇప్పుడు ఏకంగా వారికే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మోసపోయిన ప్రజల వాణిని వినిపించేందుకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఇతర వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వేణు పిలుపునిచ్చారు.
శాంతిభద్రతల్లో ఫెయిల్
వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ, శాంతిభద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను పోలీసులు రోడ్డుపై దారుణంగా హింసించిన ఘటనను హోం మంత్రి అనిత ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
ప్రజలకు అండగా ఉండేందుకే..
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ, ప్రజలకు అండగా ఉండేందుకే వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అన్యాయాలను, అక్రమాలను వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తుందన్నారు. జిల్లాలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చామన్నారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలకులు
వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. రాజమహేంద్రవరం సిటీకి తిప్పల గురుమూర్తిరెడ్డి, గోపాలపురానికి కాకుమాను రాజశేఖర్, అనపర్తికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నిడదవోలుకు పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరుకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమండ్రి రూరల్‌కు పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాజానగరం నియోజకవర్గానికి మేడా గురుదత్ ప్రసాద్‌లను పరిశీలకులుగా నియమించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు తెలిపారు. విలేకర్ల సమావేశంలో రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, జక్కంపూడి గణేష్, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ చంద్రబాబు మోసానికి నిరసనగా
నేడు వెన్నుపోటు దినం
ఫ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు


