
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మరొకరికి గాయాలు
పిఠాపురం: దైవ దర్శనానికి కాలి నడకన వెళ్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన తొగర సూర్యలక్ష్మి, అడపా చంద్రకళ (35)లు శనివారం తెల్లవారుజామున గొల్లప్రో లు నుంచి పెద్దాపురం మండలం చిన తిరుపతి బయలుదేరారు. నడుచుకుంటూ వెళుతుండగా పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అతి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వారిద్దరినీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన అడపా చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యలక్ష్మికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సూర్యలక్ష్మిని హైవే అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త త్రిమూర్తులు అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటుండగా, కుమారుడు రాజేష్ ఇటీవలే పదో తరగతి పాసై ఇంటర్‌లో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. అంతా తానై కుటుంబాన్ని చూసుకునే చంద్రకళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబం వీధిన పడిందని స్థానికులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. నీకు నాలాగ పేదరికం ఉండకూడదని, తనను తల్లి చదివిస్తుందంటూ కుమారుడు రాజేష్ గుండెలవిసేలా విలపించాడు.