
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
రీజనల్ కోఆర్డినేటర్ బొత్స రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం కాకినాడలో జరగనుంది. పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాకినాడ డి కన్వెన్షన్‌లో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, సిటీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి దాడిశెట్టి రాజా గురువారం మీడియాకు తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొత్స మీడియాకు వివరించనున్నారు.
ఆర్టీసీ ఇన్‌చార్జ్
డీపీటీవోగా రాఘవకుమార్
రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌గా ఎస్‌టీపీ రాఘవకుమార్ గురువారం రాజమహేంద్రవరం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీపీటీవోగా బాధ్యతలు నిర్వహించిన షర్మిల అశోక విజయవాడ బదిలీ కావడంతో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీపీటీఓగా ఉన్న రాఘవకుమార్‌కు తూర్పుగోదావరి జిల్లా డీపీటీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహిస్తానని తెలిపారు.
ఈసెట్ 25 ఫలితాల్లో
92.92 శాతం ఉత్తీర్ణత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈసెట్ 2025 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 92.92 ఉత్తీర్ణత శాతం సాధించింది. అనంతపురంలోని జేఎన్‌టీయూలో ఈనెల 6వ తేదీన జరిగిన ఈ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ఈ పరీక్ష మొత్తం 1,116 మంది పరీక్షలు రాశశారు. వీరిలో 1,037 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 790 మంది పరీక్షలు రాయగా 722 మంది, బాలికల విభాగంలో 326 మంది పరీక్షలు రాయగా 315 మంది ఉత్తీర్ణత సాధించారు.

నేడు వైఎస్సార్ సీపీ సమావేశం