
క్రీడలతో ఒత్తిడికి కళ్లెం
రాజానగరం: క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు శరీరదారుఢ్యాన్ని పొందవచ్చని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలను దివాన్ చెరువులోని ఎస్‌వీపీవీ కన్వెన్షన్ హాలులో శనివారం ఆయన ప్రారంభించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎలీషారావు మాట్లాడుతూ, ఒకప్పుడు రాజమహేంద్రవరానికి చెందిన మాదిరెడ్డి చెన్నకేశవరావు కుస్తీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ చాంపియన్ అయ్యారని గుర్తు చేశారు. తాలింఖానాలు ఉండటంతో ఆ రోజుల్లో చాలామంది కుస్తీ క్రీడాకారులుండేవారన్నారు. తిరిగి అటువంటి వాతావరణం తీసుకువచ్చే విధంగా పాఠశాలల్లో తాలింఖానాలు ఏర్పాటు చేసి, ఆసక్తి ఉన్న విద్యార్థులను మంచి రెజ్లర్లుగా తీర్చిదిద్దుదామని అన్నారు. అండర్–15, అండర్–20 బాలుర, బాలికల విభాగాల్లో జరుగుతున్న ఈ కుస్తీ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 350 మంది రెజ్లర్లు హాజరయ్యారు. ఐకాన్ చార్టర్ అధ్యక్షుడు టి.రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జీఎస్‌ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు, కార్యదర్శి వెంకట రమణ, ఐకా న్స్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, కార్యదర్శి సురేష్ ఉదయగిరి పాల్గొన్నారు.

క్రీడలతో ఒత్తిడికి కళ్లెం