ఇది మహాదారుణం కాదా.. | Sakshi
Sakshi News home page

ఇది మహాదారుణం కాదా..

Published Sun, May 28 2023 9:06 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒడ్డు ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న అన్న సామెత చంద్రబాబుకు అతికినట్టుగా సరిపోతుంది. అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పించేయడం.. అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో చంద్రబాబు లెక్కలేనన్ని హామీలిచ్చినా, అట్టహాసంగా మేనిఫెస్టో చూపినా ప్రజలు విశ్వసించలేదు. ఫలితంగా ఘోర పరాభావం ఎదుర్కొన్నారు.

తాజాగా ఎన్టీఆర్‌ శతజయంత్యుత్సవాల పేరిట రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడుతో మరోసారి అబద్ధపు హామీలతో ముందుకొచ్చారు. ఈ మహానాడు ప్రత్యేకమైనదంటూ పార్టీ చిహ్నంలో నాగలి, చక్రం, గృహం పెట్టారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని శనివారం మహానాడులో చెప్పుకొచ్చారు. ఆయన మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేకుంటే మరో మాట చెప్పి మోసం చేసిన వైనాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

కేఎస్‌ఈజెడ్‌లో నాడు అరాచకం
కాకినాడ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(కేఎస్‌ఈజెడ్‌)లో తస్మదీయులకు లబ్ధి చేకూర్చాలని అప్పట్లో చంద్రబాబు హడావిడిగా అనుమతులు ఇచ్చేశారు. ఆయన గద్దె దిగిపోయాక మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కేఎస్‌ఈజెడ్‌ను పట్టాలెక్కించారు. అప్పట్లో ప్రతిపక్షంలోకి వచ్చిన చంద్రబాబు మాట మార్చారు. అవసరం లేని భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి రాగానే చంద్రబాబు మాటలు షరా మామూలే. ఆయన మాటలు నమ్మిన రైతులు సెజ్‌ భూముల్లో సాగుకు సన్నద్ధమైతే వారిపై నెలల తరబడి నిర్బంధకాండ కొనసాగించారు. అక్కడ నెలల తరబడి పోలీసు రాజ్యమే నడిపారు. వందలాది కేసులు పెట్టి రైతులను జైలుపాలు చేశారు.

జగన్‌ హయాంలో..
నాడు విపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా సెజ్‌లో పర్యటించారు. సెజ్‌కు అవసరం లేకున్నా భూములు సేకరించిన విషయం గుర్తించారు. తాను అధికారంలోకి రాగానే ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కాకినాడ సెజ్‌లో సుమారు 2,180 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చే ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరుగుతోంది.

క్రాప్‌ హాలిడే హామీలు గాలికి.. 
2011లో గిట్టుబాటు ధర లభించడం లేదని, సాగు సానుకూలంగా లేదని కోనసీమ రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కోనసీమ వచ్చి, రైతులకు అండగా ఉంటానని కల్ల»ొల్లి కబుర్లు చెప్పారు. గిట్టుబాటు ధర ఇప్పిస్తానని, సకాలంలో క్లోజర్‌ పనులు చేయిస్తానని హామీలు గుప్పించారు. సీనియర్‌ ఐఏఎస్, మాజీ చీఫ్‌ సెక్రటరీ మోహన్‌కందా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన 15 సిఫారసులను స్వాగతించారు. వాటిని అధికారంలోకి రాగానే అమలుచేస్తానన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేసిన దాఖలాల్లేవు. పైపెచ్చు వ్యవసాయం దండగంటూ రైతుల మనసులు గాయపడేలా అవహేళన కూడా చేశారు.

మరి జగన్‌ అలా కాదే..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్‌మోహన్‌రెడ్డి కూడా నాటి క్రాప్‌ హాలిడేను గుర్తెరిగి సీఎం అయిన తరువాత రైతుల పక్షాన నిలిచారు. ధాన్యానికి మద్దతు ధర విషయంలో చొరవ చూపారు. ప్రత్యేకంగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర లభించేలా చూస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడో రోజు నుంచే రైతుల ఖాతాల్లో సొమ్ము వేయిస్తున్నారు. క్రాప్‌ హాలిడే సందర్భంలో హామీ ఇచ్చినట్టుగా ఉచిత పంటల బీమా, సకాలంలో నష్టపరిహారం పంపిణీ వంటివి  అమలు చేస్తున్నారు.

పుష్కర మృతులు గుర్తున్నారా.. 
నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు 2015 గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలి తీసుకున్నారు. జనసందోహం కనిపించాలనే ప్రచార యావతో ఒక సినీ దర్శకుడు చంద్రబాబుపై చేసిన షూటింగ్‌ ఈ ఘోరానికి కారణమైంది. ఈ దుర్ఘటనను గోదావరి జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువరు. చంద్రబాబు వీఐపీ ఘాట్‌ కాకుండా పుష్కరాల రేవులో స్నానం చేశారు. ఆ సమయంలో జనం బాగా కనిపించాలనే యావతో ఆ ఘాట్‌ గేట్లు మూసివేయడం, తరువాత ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగి, 29 మంది మృతి చెందారు. ఈ సంఘటన తర్వాత తమను పరామర్శించే తీరిక చంద్రబాబుకు లేకుండా పోయిందని మృతుల కుటుంబాలు ఇప్పటికీ దుమ్మెత్తిపోస్తున్నాయి. కమిటీలపై కమిటీలు వేసి ఈ విషాద సంఘటనను మసి పూసి మారేడుకాయగా చేసి, భక్తులదే తప్పు అన్నట్టుగా తేల్చారు. ఈ కుటుంబాల క్షోభపై మహానాడులో చంద్రబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగలరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కాపులపై ఉక్కుపాదం
కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పాలనలో పోలీసులు దాషీ్టకాలకు పాల్పడ్డారు. ముద్రగడతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు సామాజిక వర్గీయులపై వందలాది కేసులు బనాయించారు.

జగన్‌ చూపిన మానవత
కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక మానవతా దృక్పథంతో ఎత్తివేశారు. తుని రైలు దహనం దుర్ఘటనలో చంద్రబాబు అండ్‌ కో అక్రమంగా నమోదు చేసిన కేసులను ఇటీవల న్యాయస్థానం కొట్టివేసింది. 

Advertisement
Advertisement