మట్టిలో మాణిక్యాలు.. వెలుగులు చిందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల జ్యోతులు | AP Govt school students got good success in public exams | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యాలు.. వెలుగులు చిందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల జ్యోతులు

Apr 29 2023 6:10 AM | Updated on Apr 30 2023 8:31 PM

- - Sakshi

వీరు మట్టిలో మాణిక్యాలు.. సాధారణ పరిస్థితుల మధ్య పెరుగుతూ వెలుగులు చిందిస్తున్న జ్యోతులు.. పేదరికం ప్రతిభకు ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తున్న ధీరులు.. చదువుపైనే గురి పెట్టి లక్ష్యం సాధించిన విజేతలు.. నిన్నటి ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో మార్కులతో ప్రకాశించిన ప్రతిభావంతులు. కార్పొరేట్‌ సంస్థల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోమని చాటిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు.. ప్రభుత్వ బడుల్లో చదివే వారికి స్ఫూర్తి ప్రదాతలు..

సాక్షి ప్రతినిధి, కాకినాడ/నెట్‌వర్క్‌: తాజాగా విడుదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు రాణించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈసారి మెరుగైన ఫలితాలే వచ్చాయి. ఈ కళాశాలల్లో పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు మెరికల్లా రాణించారు. వీరి ప్రతిభకు ప్రభుత్వ విధానాలు తోడయ్యాయి. ‘నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో తీసుకువచ్చిన మార్పులు సత్ఫలితాన్నిస్తున్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యారంగంపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు, కళాశాలలు నిలబడాలనేది ఆయన బలమైన సంకల్పం. అందుకే ఈ రంగానికి నిధుల లోటు రానీయకుండా శ్రద్ధ వహిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఏ పరీక్ష ఫలితాలు వచ్చినా కార్పొరేట్‌ విద్యా సంస్థలదే పైచేయిగా నిలిచేది. ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు కార్పొరేట్‌తో పోటీ పడుతున్నారు. అత్యధిక మార్కులు సాధిస్తూ ఔరా! అనిపిస్తున్నారు. గుణాత్మక విద్యా విధానం, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు ప్రభుత్వ కాలేజీల ముందడుగుకు దోహదపడుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఫలితాల్లో మెరుగు

ఈ ఏడాది ఇంటర్మీడియెట్‌ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థులు సత్తా చాటారు. రెక్కాడితేనే కానీ డొక్కాడని రోజు కూలీలు, కౌలు రైతులు, చిరు వ్యాపారులు, ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ కాలేజీల్లో చదువుతూ 900 పైబడి మార్కులు సాధించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 45 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలున్నాయి. వీటి నుంచి ఇంటర్‌ రెండో సంవత్సర పరీక్షలకు 5,316 మంది హాజరయ్యారు. వీరిలో 2,219 మంది ఉత్తీర్ణులయ్యారు. 41.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఐదు జూనియర్‌ కాలేజీలు ఉత్తమంగా నిలిచాయి. దేవీపట్నం, మామిడికుదురు, గొల్లప్రోలు, అమలాపురం, వై.రామవరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి. మారుమూల ఉన్న దేవీపట్నం (ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా) ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ 70 శాతంతో మొదటి స్థానంలో నిలవడం విశేషం.

గతంతో పోల్చితే బెటర్‌

గత ఏడాదితో పోల్చితే ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్‌కు పోటీ ఇచ్చారు. ఈ ఏడాది పాటు నిర్వహించిన విద్యా ప్రణాళికే ఇందుకు కారణం. అధ్యాపకులు శ్రమ పడ్డారు. జిల్లాను ముందుకు తీసుకెళ్లారు. ఫెయిలయిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు చెప్పిస్తాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాది ఫలితాల్లో నంబర్‌ వన్‌ స్థానం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం.

– ఐ.శారద, రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, ఇంటర్మీడియెట్‌ బోర్డు జోన్‌ 1, 2

టాప్‌ కాలేజిల తీరు

ప్రభుత్వ హాజరు పాస్‌ ఉత్తీర్ణతా

కళాశాల శాతం

దేవీపట్నం 30 21 70.00

మామిడికుదురు 85 52 61.18

గొల్లప్రోలు 88 53 60.23

అమలాపురం 118 67 56.78

వై.రామవరం 43 24 55.81

రాజమహేంద్రవరం 462 247 53.46

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement