అమలాపురం టౌన్: కళాశాలలకు వెళ్లకుండా వేరే వ్యాపకాలతో కాలక్షేపం చేసే విద్యార్థుల ఆటలు ఇక చెల్లవు. కళాశాలలకు ఒక పూట వచ్చి పైలాపచ్చీసుగా తిరిగే విద్యార్థులకు చెక్ పెట్టేలా విద్యాశాఖ ఫేషియల్ అటెండెన్స్ విధానానికి ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు ఈ విధానం అమలవుతోంది. గత సంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకూ ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలల్లోనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు
ఫేషియల్ అటెండెన్స్ లింకు
కొంతమంది విద్యార్థులు కళాశాలలకు సక్రమంగా రాకుండా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్నారు. దీంతో విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీ యంబర్స్‌మెంట్ వర్తించేలా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఫేషియల్ అటెండెన్స్‌తో లింకు పెట్టింది. జిల్లాలో ఉన్న 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు జరుగుతోంది. జిల్లాలోని 65 వరకూ ఉన్న ప్రైవేటు డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం వల్ల జిల్లాలోని కొన్ని కళాశాలల్లో విద్యార్థులు హాజరు కాకపోయినప్పటికీ వారిని హాజరైనట్లు చూపించి వారి నుంచి కొంత డబ్బును తీసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ ఆధారిత హాజరుతో ఇక ఆ ఆటలు చెల్లవు. కొన్ని కళాశాలల అధ్యాపకులు వేరే కోర్సుల స్టడీ పేరుతో అనధికార సెలవులు పెట్టే విధానానికి ఈ ఫేషియల్ రికై ్నజ్డ్ సిస్టమ్‌తో అడ్డుకట్ట పడనుంది. జిల్లాలోని ప్రైవేటు కళాశాలలకు ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు రాకపోయినప్పటికీ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తారని భావిస్తున్నారు.
విద్యార్థులకు ఇబ్బంది
ఫేషియల్ అటెండెన్స్‌తో నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెండింగ్ లేకుండా జమ చేయాలని ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2024–25 సంవత్సరానికి ప్రభుత్వం కొంత మొత్తాన్నే జమ చేసింది. అదే 2025–26 సంవత్సరానికి ఒక రూపాయి కూడా జమ చేయలేదు. ఈ పెండింగ్ వల్ల జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.
హాజరు శాతం పెరుగుతుంది
ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటున్నాం. ఈ విధానం అన్ని కళాశాలకు వర్తింప చేస్తుండడం వల్ల విద్యార్థుల హాజరు పెరిగే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ వి.నరసింహస్వామి, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అమలాపురం
ఇక ఫేషియల్
అటెండెన్స్‌తో హాజరు నిర్ధారణ
ఫీజు రీయింబర్స్‌మెంట్
కళాశాలల్లో అమలుకు ఏర్పాట్లు
ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు
ప్రైవేటు కళాశాలల్లోనూ
ప్రారంభానికి సన్నాహాలు


