సాక్షి, అమలాపురం: గోదావరి పొడవునా అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక దోచేస్తున్నారు. జొన్నాడ ఫ్‌లై ఓవర్ పేరుతో ఏటా టన్నుల కొద్దీ లంక మట్టిని తవ్వేస్తున్నారు. సముద్ర తీరంలో బొండు ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇవన్నీ సరిపోనట్టుగా ఇప్పుడు పచ్చని డెల్టా పంట చేల మీద పడ్డారు. చేలల్లో మెరక తొలగింపు పేరుతో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.
నాయకుల కనుసన్నల్లో..
జిల్లాలో మట్టి మాఫియా విజృంభిస్తోంది. కూటమి పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో డెల్టా చేలల్లో టన్నుల కొద్దీ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వందల కొద్దీ ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. డెల్టాలో ఎటుచూసినా చేలల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతూ కనిపిస్తున్నాయి. అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. సాధారణంగా వేసవిలో రైతులు చేలల్లో మెరకను తొలగించే పనులు చేస్తుంటారు. మెరక తొలగించి ఆ మట్టితో చేలగట్లను పటిష్టం చేసుకుంటారు. ఇప్పుడు వాటి స్థానంలో మట్టి అమ్మకాలు మొదలయ్యాయి. అమలాపురం, రామచంద్రపురం పట్టణ శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పొలాలను మెరక చేసేందుకు ఈ మట్టిని ెవినియోగిస్తున్నారు.
చేతులు తడపడంతో నోరు మెదపడం లేదా?
ఇటీవల డెల్టాలో రైతులు వరిసాగుకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల వైపు మళ్లిన విషయం తెలిసిందే. కూరగాయలు, మామిడి, కొబ్బరి వంటి పంటల కోసం పెద్ద ఎత్తున చేలను మెరక చేస్తున్నారు. ఇందుకు మట్టి, తువ్వ ఇసుక అవసరం ఉంది. ఇదే మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. చేలల్లో ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారంటే మట్టి అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం ట్రాక్టరు జిగురు మట్టి చేల వద్ద రూ.900 నుంచి రూ.1,400 వరకు ఉంది. అదే బొండు ఇసుక, ఎర్ర ఇసుక అయితే రూ.1,200 నుంచి రూ.రెండు వేలు చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ఈ ధరలు గత ఏడాది కన్నా అధికం కావడం గమనార్హం. ఇంత జరుగుతున్నా మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు మౌనం పాటిస్తున్నారు. మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖ మౌనం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు చేతులు మారడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెరక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మెరక మట్టిని తొలగించే అనుమతులు ఉన్నా బయటకు తరలించేందుకు అనుమతులు ఉండవు. అయినా రోజూ వందలాది ట్రాక్టర్ల మట్టి తరలిపోతూనే ఉంది.
కలసి వచ్చిన కాలువలకు
నీటి విడుదల వాయిదా
మే 15వ తేదీన డెల్టా పంట కాలువలకు నీరు విడుదల చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసిందే తప్ప నీరు విడుదల చేయలేదు. కనీసం పంట కాలువలకు నీరు వదిలి, కొంతమంది రైతులైనా సాగు మొదలు పెట్టి ఉంటే మట్టి తవ్వకాలు అదుపులోకి వచ్చేవి. ఇప్పుడు నీరు విడుదల చేయకపోవడంతో మట్టి మాఫియా మరింత చెలరేగిపోతోంది. జూన్ 1వ తేదీకి నీరు ఇచ్చినా 15వ తేదీ వరకు జిల్లాలో చేలల్లో మట్టి తవ్వకాలు నిర్విఘ్నంగా సాగనున్నాయి.
జిల్లాలో చెలరేగిపోతున్న
మట్టి మాఫియా
మొన్న లంక మట్టి.. నిన్న బొండు
ఇసుక.. నేడు చేలల్లో మట్టిపై కన్ను
మెరక పనుల పేరుతో దందా
డెల్టా కాలువలకు
నీటి విడుదల వాయిదా
మరింత విచ్చలవిడిగా
వందలకొద్దీ ట్రాక్టర్లలో తరలింపు
ముంపునకు ఇదీ ఒక కారణం
భారీ వర్షాలు, తుపానుల సమయంలో డెల్టాలోని తీర ప్రాంత మండలాల్లోనే కాకుండా.. ఐదేళ్లుగా మెరక ప్రాంతాలలో కూడా చేలు ముంపుబారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ ముంపునకు భయపడే రైతులు ఏటా సుమారు 40 వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు వదిలేస్తున్నారు. డెల్టాలో మురుగునీటి కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉండడానికి తోడు చేలల్లో మట్టి తవ్వకాలు కూడా ముంపునకు కారణమవుతున్నాయి. డెల్టా పంట, మురుగునీటి కాలువ వ్యవస్థ అనేది కాంటూరు వ్యవస్థలో ఉంటాయి. ఒకటి నుంచి రెండు అడుగుల లోతున కాలువలు తవ్వకాలు చేస్తే నీరు పారదు. చేల తవ్వకాలు చేస్తే ముంపు నీరు నిలిచిపోతోంది. ఇటువంటి చోట మట్టి మాఫియా రైతులను మభ్యపెట్టి లోతున తవ్వకాలు చేస్తున్నారు. పై వరుస మట్టి తీస్తామని చెప్పి ఏకంగా జేసీబీలు వంటి వాహనాలు వినియోగించి రెండు అడుగులు లోతున తవ్వకాలు చేస్తున్నారు. దీనివల్ల మట్టి తీసిన చేలలోనే కాకుండా ఆయకట్టు ఉన్న సరిహద్దులోని చేలు కూడా ముంపునకు గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి అనుమతి లేని అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు.


