అమలాపురం రూరల్: ఆర్టీసీలో విద్యుత్ బస్సులు కోనుగోలు చేసి ఉద్యోగులతో నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు అమలాపురం డిపోలో బుధవారం ధర్నా నిర్వహించారు. అమలాపురం డిపోలో గ్యారేజ్ గేట్ వద్ద బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం డిపోలకు చెందిన ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్‌ఎంయూ జిల్లా కార్యదర్శి పందిరి రాంబాబు, డిపో కార్యదర్శి పితాని మణిరాజు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనలో చేశారు. ఽప్రైవేటీకరణ నిలిపివేయాలని, సీ్త్ర శక్తి జీరో టికెట్ నిలుపుదల చేసి మిగతావారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్, లీవ్ ఎన్ కాష్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పీఆర్‌సీ కమిటీ వేసి ఐఆర్ ఇవ్వాలని, ఈహెచ్‌ఎస్ మినహాయించి పాతవ్యై విధానం కొనసాగించాలని, రిటైర్ చనిపోయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ ఎమౌంట్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ తగదు
రామచంద్రపురం: దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం దారుణమని ఎన్‌ఎంయూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎంయూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రామచంద్రపురం ఆర్టీసీ డిపో గేట్ వద్ద రెండు రోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో ఆర్టీసీ కార్మికులు, ఎన్‌ఎంయూ నేతలు బ్యాడ్జీలు ధరించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌ఎంయూ డిపో ప్రెసిడెంట్ సీహెచ్‌వీ రావు, సెక్రటరీ బండి ముత్యాలరావు, రీజనల్ కమిటీ నాయకులు ఎస్ సీహెచ్ వేంకటేశ్వర్లు జీడీవీ కుమార్ మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆర్టీసీని ప్రైవేటు పరం దిశగా ఈ ప్రభుత్వం తీసుకువెళ్లటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆర్టీసీని నష్టాల సాకుతో ప్రైవేటు పరం చేయటం తగదన్నారు. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని, ఎన్‌ఎంయూ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పోరాటం చేస్తారని వారు స్పష్టం చేశారు. ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బంది, డ్రైవర్‌లు, కండక్టర్లు పాల్గొన్నారు.


