● జోరుగా సముద్ర ఉత్పత్తుల విక్రయం
● మామూళ్ల మత్తులో మత్స్యశాఖ అధికారులు
తాళ్లరేవు: మండల పరిధిలోని మట్లపాలెం ఫిష్ మార్కెట్ వద్ద సముద్ర ఉత్పత్తులను జోరుగా విక్రయిస్తున్నారు. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి సమయంలో వేట చేయరాదంటూ ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు మత్స్యకారులు యధేచ్ఛగా సముద్రంలో వేట సాగిస్తున్నారు. దీంతో మత్స్య సంతానోత్పత్తిపై ఆ ప్రభావం పడుతోంది. సాధారణంగా ఏప్రియల్, మే, జూన్ నెలల మధ్యలో మత్స్య సంతానోత్పత్తి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యేటా ఏప్రిల్ 15వ తేదీనుంచి జూన్ 15 వరకు చేపల వేటపై నిషేధం విధిస్తుంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం నెలకు రూ.10వేల చొప్పున రెండు నెలలకు రూ.20 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ కొందరు మత్స్యకారులు నిబంధనలను ఉల్లంఘించి సముద్రంలో రహస్యంగా వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండదండలతోనే ఇలా జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం మట్లపాలెం మార్కెట్‌లో సముద్ర ఉత్పత్తులైన సొరలు, నెత్తళ్లు, పీతల విక్రయం జోరుగా సాగింది. వేట నిషేధం ఉండగా వీటిని ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా, కొందరు మత్స్యశాఖ అధికారుల సహకారంతో దొంగ వేట కొనసాగుతుందని పలువురు మత్స్యకారులు బాహాటంగానే చెప్పడం గమనార్హం. దీనిపై తాళ్లరేవు మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లావణ్యను వివరణ కోరగా సముద్రంలో వేటపై నిషేధం ఉందని, దానిని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సముద్ర ఉత్పత్తులు ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు.


