కాట్రేనికోన: దళారులతో చేతులు కలిపిన మత్స్యశాఖ సిబ్బంది చేతివాటం చూపి అసలైన మత్స్యకార భరోసా లబ్ధిదారులను తొలగించి చేపల వేటతో సంబంధం లేనివారి పేర్లు ఆన్‌లైన్ జాబితాలో నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేపల వేట చేస్తున్న కళాసీలను సర్టిఫై చేస్తూ బోటు ఓనర్లు మత్స్యశాఖ సర్వే సిబ్బందికి పత్రాలు ఇవ్వడంతో బోటుపై కళాసీలను ఉంచి గుర్తింపు ఫొటోను తీసారు. అయితే తాము సర్టిఫై చేసి మత్స్యశాఖ అధికారులకు అందచేసిన లబ్ధిదారులకు బదులు చేపల వేటకు సంబంధం లేని వారి పేర్లు ఆన్‌లైన్ జాబితాలో దర్శనం ఇవ్వడంతో బోటు ఓనర్లు కంగుతిన్నారు. గ్రామ సచివాలయాల్లో మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన జాబితాలో వందలాది మంది లబ్ధిదారుల పేర్లు గల్లంతు అయ్యాయి. వాటి స్థానంలో కొత్తవారి పేర్లు కనిపించడంపై వారు మండిపడుతున్నారు. కనీసం బోటు ఓనరుకు సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పేర్లు మార్పు చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు లబ్ధిదారులు గళం విప్పారు. పింఛను తీసుకోవడం, అధికంగా వచ్చిన కరెంటు బిల్లులు సాకుగా చూపిస్తూ లబ్ధిదారులను తొలగించి వారి స్థానంలో సంబంధంలేని వారిని భరోసా జాబితాలో ఆన్‌లైన్ చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఆన్‌లైన్ జాబితాలో చేర్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.8వేలు చొప్పున దళారీలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. బ్రహ్మ సమేథ్యం పంచాయతీ బలుసుతిప్ప, కొత్తపాలెం, మగసానితిప్ప గ్రామాలలో సుమారు 200 పేర్ల వరకు తొలగించి కొత్తవారి పేర్లు చేర్చినట్టు సమాచారం.
మత్స్యశాఖ అధికారుల మాయాజాలంలో కొన్ని..
బోటు నంబర్ 78, 150, 380, 384, 500, 534, 610, 1,264, 1,348, 1,434 కామాడి బ్రహ్మాజి, కామాడిరాజు, మల్లాడి శ్రీను, పినపోతు మల్లి, రామనాథ్, పాలెపు బాలదాసు శ్రీను, పెమ్మాడి సతీష్‌కుమార్, మల్లాడి భైరవమూర్తి, మల్లాడి కార్తీక్, నాట్ర వీరేంద్ర వర్మలను జాబితా నుంచి తొలగించి వాటి స్థానంలో వేరే పేర్లు ఆన్‌లైన్ చేశారు. వీరిలో చేపల వేటకు సంబంధంలేని ఇతర కులస్తులు పేర్లు ఉన్నాయని బోటు ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం,కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలలో సుమారు 1,700 బోట్లకు ఈ నెల 18న మత్స్యశాఖ అధికారులు మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వే చేపట్టారు. చేపలు, రొయ్యలు ప్రత్యుత్పత్తి జరిగే సమయం ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. వేటను కోల్పోతున్న లబ్ధిదారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం రూ.20 వేలు చొప్పున చెల్లిస్తుంది. బోటుపై వేటాడుతున్న కళాసీలను సర్టిఫై చేసి జాబితాను బోటు ఓనర్లు మత్స్యశాఖ అధికారులకు సమర్పించవలసి ఉంది. బోటు ఓనర్లు కళాసీల నుంచి రూ.10వేలు చొప్పున, మత్స్యకార భరోసా గుర్తింపు సర్వే చేపట్టిన అధికారులు ఖర్చుల పేరుతో బోటుకు రూ.1,200 చొప్పున వసూలు చేశారని సమాచారం. మండలంలో 1,001 బోట్లకు 6,006 మంది లబ్ధిదారులు ఉన్నారు. బ్రహ్మ సమేథ్యం పంచాయతీ పరిధిలోని బలుసుతిప్ప, కొత్తపాలెం, నీళ్ళరేవు, మగసానితిప్ప, పల్లం, చిర్రయానం బోట్లకు యజమానితో పాటు ఆరుగురు కళాసీలు చొప్పున గుర్తించి సర్వే పూర్తి చేశారు. లబ్ధిదారుల జాబితాలో పేర్ల మార్పుపై మత్స్యశాఖ ఇన్‌చార్జి జేడీ ఎల్‌బీఎస్ వర్థన్‌ను వివరణ కోరగా వసూళ్లతో తమకు సంబంధం లేదన్నారు. భరోసా లబ్ధిదారులకు న్యాయం చేస్తానని, ఆన్‌లైన్ జాబితాలో లబ్ధిదారులను తొలగించి కొత్త పేర్లు చేర్చితే వాటిని తొలగిస్తామన్నారు.
దళారులతో చేతులు కలిపి
మత్స్యశాఖ మాయాజాలం
బోటుపై ఫొటో గుర్తింపు ఒకరిది..
ఆన్‌లైన్ జాబితాలో మరొకరు
మత్స్యకార భరోసా పేర్లు
తొలగింపుపై లబ్ధిదారుల ఆందోళన
పేరు మారింది
నా బోటు రిజిస్ట్రేషన్ నంబర్ 534. నా బోటుపై పనిచేస్తున్న కళాసీల పేర్లతో డిక్లరేషన్ పత్రం మత్స్య శాఖ అధికారులకు అందజేశాను. పాలెపు బాలదాసు శ్రీనివాసరావుకు బదులు ఈశ్వరరావు పేరు ఆన్‌లైన్ జాబితా లో ఉంది.
– పేమ్మడి ఆదినారాయణ, బోటు ఓనర్
వేటకు సంబంధం లేనివారు జాబితాలో..
బోటు రిజిస్ట్రేషన్ నంబర్ 610.....నా పేరుకు బదులు మోరంపూడి జోయల్ లివింగస్టన్ పేరు ఆన్‌లైన్‌లో ఉన్న లబ్ధిదారుల జాబితాలో ఉంది. చేపల వేటకు సంబంధం లేని ఇతర సామాజక వర్గం చెందిన వ్యక్తి పేరు జాబితాలో ఉండడం ఆశ్చర్యపరచింది.
– పేమ్మడి సతీష్ కుమార్


