సాక్షి, అమలాపురం/ ఆలమూరు: జిల్లాలో డీజిల్ కొరత పెరిగే కొద్దీ అన్నదాత కష్టాలు రెట్టింపవుతున్నాయి. అష్టకష్టాలు పడి పంట పండించిన రబీ వరి రైతులకు సరిగ్గా కోతలు.. కుప్ప నూర్పిళ్లు.. ధాన్యం పట్టుబడుల సమయంలో డీజిల్ కొరత వారి నెత్తిన పిడుగు పడినట్టయింది. డీజిల్ కొరత వల్ల వరి మాసూళ్లు అన్నదాతకు అదనపు భారంగా మారింది. సమయానికి వరికోత యంత్రం అందుబాటులో ఉన్నా డీజిల్ కొరతతో కోత ధరకు రెక్కలొచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 872 వరి కోత యంత్రాలు పనిచేస్తున్నాయి. రామచంద్రపురం, కె.గంగవరం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల్లో ముమ్మరంగా వరి కోతలు జరుగుతుండగా మిగిలిన మండలాల్లో సైతం కోతల మొదలయ్యాయి. డీజిల్ కొరతను బూచిగా చూపి వరి కోత యంత్రం అద్దెను పెంచేశారు. ఇప్పటి వరకూ గంటకు రూ.2,800–రూ.3000 వరకు వరకు అద్దే ఉండేది. డీజిల్ కొరత పేరుతో అద్దె రూ.3,500కు పెంచారు. ఎకరాకు కోతకు వచ్చి రూ.500 నుంచి రూ.700 వరకు పెరగడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఎంత చేసి డీజిల్ పట్టుకు రావలసిన బాధ్యత రైతులదే కావడం గమనార్హం. అలాగే ధాన్యాన్ని రవాణా చేసే ట్రాక్టర్, మినీ వాహనాల కిరాయి ధరలు కూడా పెగిపోయాయి. డీజిల్ కొరతను బూచిగా చూపి సాధారణ రవాణా చార్జీల కన్నా అదనంగా 20 శాతం ధరలు పెంచేశారని రైతుల ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల నుంచి బయట పడ్డామని అనుకున్న సమయంలో డీజిల్ కొరత వరి రైతులకు సంకటంగా మారింది.
పెరిగిన కొబ్బరి రవాణా చార్జీలు
కొబ్బరి రైతులపై డీజిల్ కొరత పరోక్ష భారాన్ని మోపుతుంది. కొబ్బరి ఎగుమతి కేంద్రమైన జిల్లాలోని అంబాజీపేట నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కురిడీ కొబ్బరి, నీటి కొబ్బరి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసింది. ఈ సీజన్‌లో అంబాజీపేట నుంచి కురిడీ కొబ్బరి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలకు రోజుకు 30 లారీలకు పైగా ఎగుమతి అవుతుంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి రోజుకు సగటున 70 లారీల వరకు నీటికొబ్బరి (పచ్చి కొబ్బరి) ఎగుమతి జరుగుతుందని అంచనా. ఈ లారీల రవాణాకు సైతం డీజిల్ కొరత ప్రధాన అవరోధంగా మారింది. చాలా బంకుల్లో డీజిల్ లేకపోవడం ఉన్నచోట రేషన్ పద్ధతిలో డీజిల్ కొట్టడం వల్ల లారీ యజమానులు సుదూర ప్రాంతాలకు రవాణా అంటే భయపడుతున్నారు. దీనిని సాకుగా చూపించి రవాణా ధరలు పెంచేశారు. అంబాజీపేట నుంచి రాజస్తాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు లారీ కిరాయి రూ.లక్ష వరకు ఉండేది. ఇప్పుడు అది 20 శాతం వరకు పెరిగిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అదనంగా పెరిగిన రవాణా భారాన్ని స్థానిక వ్యాపారులు రైతులపై మోపుతున్నారు.
ఆక్వా రైతులదీ ఇంచుమించు ఇదే పరిస్థితి
గత వారం రోజులుగా ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో డీజిల్ మీదనే ఏరియేటర్లు తిప్పాల్సి వస్తుంది. అలాగే చిన్న, సన్న కారు రైతుల్లో ఎక్కువ మందికి విద్యుత్ సౌకర్యం లేదు. వీరంతా డీజిల్ జనరేటర్లు ఆశ్రయించాల్సి వస్తోంది. రొయ్యల చెరువులే కాకుండా చేపల చెరువులకు నీరు అందించాల్సి ఉన్న డీజిల్ మోటార్ల మీదనే ఆధార పడాల్సి వస్తుంది. వీరంతా స్థానికంగా ఉన్న బంకుల వద్దనే డీజిల్ కొనుగోలు చేయాల్సి ఉంది. తీరప్రాంత గ్రామాల్లో బంకులు అందుబాటులో లేని రైతులు పెట్రోల్, డీజిల్ అమ్మే బడ్డీలు, గ్రామాల్లో అనధికారికంగా డీజిల్ అమ్మే వారి వద్ద వీటిని కొనుగోలు చేస్తున్నారు. పుదుచ్చేరి యానం నుంచి అక్రమ మార్గంలో డీజిల్ తెచ్చి స్థానికంగా విక్రయాలు చేస్తున్నవారు తీర ప్రాంత గ్రామా ల్లో ఎక్కువగా ఉన్నారు. గతంలో ఐదు లీటర్ల డీజిల్ రూ.500లకు ఇచ్చేవారు. ఇప్పుడు ఐదు లీటర్లను రూ.600 నుంచి రూ.700 చేసి విక్రయిస్తున్నారు. ఎకరా రొయ్యల చెరువులకు నాలుగైదు ఏరియేటర్లు ఉంటాయి. రోజుకు కనీసం 20 లీటర్ల వినియోగం ఉంటుంది. గతంలో అవుతున్న ఖర్చుకన్నా ఇప్పుడు రోజుకు రూ.400 నుంచి రూ.800ల వరకు అదనపు భారం పడుతుందని రొయ్యల రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వారి ప్రకటనలు వారివే..
కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని జిల్లా యంత్రాంగం చెబుతుంది. పనిలో పనిగా ప్రచార మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ, అసత్య ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురై, అవసరానికి మించి భవిష్యత్ అవసరాలకు గాను డీజిల్‌ను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవంగా జిల్లాలో సోమవారం కూడా పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వేలాడుతూ కనిపించాయి. పెట్రోల్, డీజిల్ స్టాక్ లేకపోవడంతో బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతూ కనిపిస్తున్నాయి.
ఫోన్లు స్విచాఫ్ చేసుకున్న బంకుల
యాజమానులు, సిబ్బంది
అమలాపురం టౌన్: అధికారుల పర్యవేక్షణ లోపం, కొరవడిన ప్రభుత్వ ముందు చూపు వల్ల జిల్లాలో డీజిల్, పెట్రోలు కొరత జటిలమైంది. ఇంత కాలం సొంత పనులకు, ప్రభుత్వ పనులకు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులకు పైరవీలు, సిఫారసులు చేయించుకున్న ప్రజలు ఇప్పుడు వాటన్నింటికీ స్వస్తి పలికి కేవలం డీజిల్, పెట్రోలు కోసం బంక్ యజమానులకు ఫోన్లు చేయించుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు బంకు యజమానులు, సిబ్బందికి ఫోన్ చేసినా సెల్‌ఫోన్లు స్విచాఫ్‌లో పెట్టేసి ఎవరికీ సమాధానం చెప్పకుండా అజ్ఞాతంలో ఉండిపోతున్నారు. అమలాపురంలో ఓ బంక్ యాజమాని, సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఎత్తకపోయే సరికి ఓ రాజకీయ నాయకుడు అసహనానికి గురయ్యాడు. ఈ విషయంలో నేనేమీ చేయలేనని ఆయిల్ కోసం సిఫారసులు, పైరవీల కోసం వచ్చిన వ్యక్తికి చెప్పి చేతులెత్తేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న చేదు అనుభవం ఇది.
మూడు రోజుల నుంచి సాగుతున్న ఇంధన కష్టాలకు ఇంకా తెరపడలేదు. పానిక్ బయింగ్, ఫ్యూయల్ ఫియర్ అంటూ కబుర్లు చెప్పిన అధికారులు డిమాండ్ తగ్గ సరఫరా చేయడంతో ఫుల్‌స్టాప్ పెట్టలేకపోతున్నారు. అసలే రబీ సీజన్ కోతల దశలో ఉండటంతో కోత మెషీన్లకు, రొయ్యల చెరువుల్లో ఏరియేటర్లకు, కొబ్బరి ఎగుమతులు చేసే లారీలకు డీజిల్ ప్రస్తుతం అత్యవసరం ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు కష్టాలు నుంచి విముక్తి లభించడం లేదు.
ఫ కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న డీజిల్ కొరత
ఫ పెరిగిన కోత మెషీన్ల అద్దె
ఫ ఉత్తర భారతానికి కొబ్బరి ఎగుమతులపై ప్రభావం
ఫ 20 శాతం వరకు పెరిగిన లారీల
రవాణా చార్జీలు
ఫ ఆక్వా పైనా అదనపు భారం
మూడు రోజులుగా మూలనే ఉంది
డీజిల్ లేకపోవడంతో గడచిన మూడు రోజులుగా కోత మెషీన్ మూలనపడి ఉంది. సీజన్‌లో ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. చెల్లూరు, అంగర, కొత్తూరు సెంటర్, మండపేట, ఆలమూరు, గోపాలపురం, రావులపా లెం తిరిగినా నాకు డీజిల్ చుక్క దొరకలేదు. ఇల్లు అమ్ముకొని వరి కోత మెషీన్ కొన్నాను. అధికారులు ఇచ్చిన స్లిప్పులు పట్టుకుని బంకులకు వెళ్తున్నా డీజిల్ దొరకడం లేదు. సీజన్‌లో పని లేకపోతే మెషీన్ ఉండి ఆదాయం లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
– చింతాకుల వెంకన్న, కపిలేశ్వరపురం


