అమలాపురం రూరల్: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా టి.నిషాంతి అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కొనియాడారు. ఆమె పదోన్నతిపై అల్లూరి సీతారామరాజు జిల్లాకు కలెక్టర్‌గా వెళుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం శనివారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా రెవెన్యూ, భూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె చూపిన చొరవను అధికారులు అభినందించారు. నిషాంతి మాట్లాడుతూ అందరి సహకారంతో సమర్థవంతంగా పనిచేయగలిగానన్నారు. ఎస్పీ రాహుల్ మీనా, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్, తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఆర్డీవోలు జి.మమ్మీ, భాగ్యవతి, డీఎస్‌ఓ ఉదయభాస్కర్ ఆర్టీవో డి. శ్రీనివాసరావు, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ధాన్యం సేకరణ
అమలాపురం రూరల్: రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై సహకార, రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాలు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,29,913 ఎకరాలలో వరిని సాగు చేయగా, సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి 194 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
మట్టి అక్రమ
తవ్వకాల పరిశీలన
పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడిలంకలో ఇటీవల పెద్ద ఎత్తున జరిగిన మట్టి అక్రమ తవ్వకాలను మైన్స్, విజిలెన్స్ అధికారులు శనివారం పరిశీలించారు. లంకలో మట్టిని తీసేందుకు ఎన్ని ఎకరాలకు అధికారులు అనుమతి ఇచ్చారు, ఏఏ ప్రాంతాల్లో ఎంత మేర మట్టిని తీశారు, ఎంత లోతున అక్రమంగా తవ్వకాలు జరిపారో వివరాలు నమోదు చేసుకున్నారు. తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు విజిలెన్స్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ కె.వెంకటరమణ, మైన్స్ ఆర్‌ఐ కె.శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో కె.నరసింహారావు పాల్గొన్నారు.
అప్పనపల్లిలో భక్తుల రద్దీ
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. సుప్రభాత సేవలు, తొలి హారతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలి హారతి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, ముడుపులు, మొక్కుబడులు, తల నీలాలు సమర్పించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,74,671 ఆదాయం వచ్చింది. 5,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, రెండు వేల మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.1,06,724 విరాళం అందించారని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నూకాంబిక హుండీ ఆదాయం రూ.26.38 లక్షలు
ఆలమూరు: చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల ద్వారా రూ.26.38 లక్షల ఆదాయం లభించింది. దేవదాయశాఖ తనిఖీ ఇన్‌స్పెక్టర్ ఆర్.బాలాజీ రామ్‌ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ వీరి అప్పారావు, కార్యనిర్వాహణాధికారి వుండవల్లి వీర్రాజు ఆధ్వర్యంలో శనివారం వీటిని లెక్కించారు. గత నెల 10 నుంచి ఈ నెల నాలుగు వరకూ (25 రోజులు) ఈ ఆదాయం వచ్చిందని ఈఓ వీర్రాజు తెలిపారు.


