అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్ పర్యవేక్షించారు.


