కార్మిక సంక్షేమానికి మేడే నాడు నూతన చట్టం | - | Sakshi
Sakshi News home page

కార్మిక సంక్షేమానికి మేడే నాడు నూతన చట్టం

Mar 30 2026 8:46 AM | Updated on Mar 30 2026 8:46 AM

కార్మిక శాఖ మంత్రి సుభాష్‌

అమలాపురం రూరల్‌: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ మేరకు వచ్చే మే 1న సీఎం చంద్రబాబు నాయుడు నూతన చట్టం అమల్లోకి తీసుకురానున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. స్థానిక కిమ్స్‌ ప్రాంగణంలో జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాతాడ నవీన్‌ రాజు అధ్యక్షతన ఆదివారం మహాసభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సుభాష్‌ మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగంలో జర్నలిస్టులను చేర్చి అన్‌ లిమిటెడ్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యంతో పాటు, అనుకోని కారణాల వల్ల జర్నలిస్టు మరణిస్తే రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రమాద బీమా వచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. నూతన లేబర్‌ కోడ్‌ ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న 2.20 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని ఆయన అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ మూలధన నిధికి ఆయన రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించకపోవడం వల్ల పింఛన్‌, బీమా సౌకర్యం ఉంటడంలేదన్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలిలో మాట్లాడతామని తెలిపారు. ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు జర్నలిస్టుల సంక్షేమానికి కార్పస్‌ ఫండ్‌గా రూ.ఐదు లక్షలు ప్రకటించారు. మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను అందించాలన్నారు. వైఎస్సార్‌ సీపీ రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేటర్‌ పాముల రాజేశ్వరి దేవి, గన్నవరపు శ్రీనివాసు మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడంతో పాటు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్న నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.50 వేల కార్పస్‌ ఫండ్‌ ప్రకటించారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు కుంచె రమణారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు ఆకుల అమరయ్య, వల్లి, మాజీ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు, రాష్ట్ర దృశ్యకళల అకాడమీ మాజీ చైర్మన్‌ కుడుపూడి సత్య శైలజ, వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, దేశంశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

అమలాపురం రూరల్‌: పీజీఆర్‌ఎస్‌ మీకోసం రెవెన్యూ క్లినిక్‌ సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో, డివిజన్‌, మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ యథావిధిగా నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు అర్జీలను వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు. అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు నేరుగా కాల్‌ చేసి తెలుసుకోవచ్చునని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement