వాడవాడలా వేంకటేశు నామమే.. | - | Sakshi
Sakshi News home page

వాడవాడలా వేంకటేశు నామమే..

Mar 30 2026 8:46 AM | Updated on Mar 30 2026 8:46 AM

వాడపల్లి క్షేత్రంలో

వైభవంగా శ్రీవారి కల్యాణం

గోవింద ఘోషతో

మార్మోగిన పుర వీధులు

కోలాహలంగా రథోత్సవం

కొత్తపేట/ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని కల్యాణం, రథోత్సవం ఆదివారం వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల గోవింద ఘోషతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచీ ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్‌, వేదపండితులు, అర్చక బృందం వివిధ పూజా, హోమం, కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించగా వేలాది భక్త జన సందోహం నడుమ మాడ వీధుల్లో స్వామివారు ముందుకు సాగిపోయారు.

కల్యాణం.. కనుల వైకుంఠం

వాడపల్లిలోని విశాలమైన ప్రదేశంలో పంచ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసన భరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మంటపంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహలను పుష్పాలంకృతమైన పల్లకిలో ఉంచి వేద మంత్రాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ కల్యాణ మూర్తులను ఆశీనులను చేశారు. కల్యాణ తిలకంతో స్వామివారు, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతూ ఉభయ దేవేరులు భక్తజనానికి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్‌, వేదపండితులు, అర్చక బృందం వేద మంత్రాల నడుమ సాయంత్రం 6.15 గంటలకు కల్యాణాన్ని వైభవంగా ప్రారంభించారు.

దేవస్థానం తరఫున శ్రీవారికి డీసీ అండ్‌ ఈఓ సూర్యచక్రధరరావు మంత్రి వాసంశెట్టి సుభాష్‌, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితర ప్రముఖులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ బందోబస్తు నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, వాయిద్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రెడ్డి అనంతకుమారి, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement