జేసీ నిశాంతి బదిలీ | - | Sakshi
Sakshi News home page

జేసీ నిశాంతి బదిలీ

Mar 30 2026 8:46 AM | Updated on Mar 30 2026 8:46 AM

అల్లూరి జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి

రెవెన్యూలో కీలక పోస్టులు ఖాళీ

సాక్షి, అమలాపురం: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన తయారైంది జిల్లాలోని రెవెన్యూ శాఖ తీరు. ఇప్పటికే కీలకమైన పోస్టులకు రెగ్యులర్‌ ఉద్యోగులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాలో ఆ శాఖకు ప్రభుత్వం మరో షాక్‌ ఇచ్చింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న టి.నిశాంతిని అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేసింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆమె ఇక్కడ జేసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అమలాపురం మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం ఆమెను నియమించింది. బదిలీపై వెళుతున్న ఆమె స్థానంలో కొత్తగా జేసీని ప్రభుత్వం నియమించలేదు. కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. గత నెలలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. 2018 గ్రూప్‌–1 మూల్యంకనంలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో నాడు ఎంపికై న వారికి హోదా తగ్గించడంతో పాటు ప్రాధాన్యం లేని పోస్టులలో నియమించాలని తీర్పునిచ్చింది. దీనిని అమలు చేయకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మండిపడింది. దీనితో ప్రభుత్వం నాడు ఎంపికై న వారిని అమరావతిలోని హెడ్‌ క్వార్టర్‌కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో నాడు డీఆర్వోగా, అమలాపురం ఆర్డీవోగా ఉన్న కె.మాధవి, కొత్తపేట ఆర్డీవోగా శ్రీకర్‌, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిలలు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. వారి స్థానంలో కొత్త వారి నియామకం జరగలేదు. డీఆర్వో, అమలాపురం ఆర్డీవోగా ఇప్పుడు బదిలీపై వెళుతున్న జేసీ నిశాంతి ఉన్నారు. కొత్తపేటకు ఆర్డీవోగా సర్వశిక్ష అభియాన్‌ ఏపీసీగా ఉన్న మమ్మీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామచంద్రపురం ఆర్డీవో పి.భాగ్యవతి కూడా ఇన్‌చార్జిగా ఉన్నారు. ఈమె రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ల్యాండ్‌ అక్విజేషన్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో జేసీ, డీఆర్వో, ముగ్గురు ఆర్డీవోలు ఇన్‌చార్జిలుగా ఉన్నారు. ప్రస్తుతం డీఆర్వో, అమలాపురం ఆర్డీవోగా ఉన్న జేసీ బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులు కూడా ఖాళీగా మారాయి. ఇక చాలా మండలాలకు తహసీల్దార్లు కూడా ఇన్‌చార్జిలు ఉండడం గమనార్హం. అమలాపురం, ఉప్పలగుప్తం మండలాలకు వీఎస్‌ దివాకర్‌ రెండు చోట్లా ఇన్‌చార్జిలుగా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ మినహా మిగిలిన కీలకమైన పోస్టులన్నీ ఇన్‌చార్జిలతో సాగుతున్నాయి. కీలకమైన రెవెన్యూ శాఖను చంద్రబాబు ప్రభుత్వం ప్రయోగాలకు వేదికగా మార్చి నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement