ఆలమూరు: సగటు జీవి జీతంలో సింహభాగం ఖర్చయ్యేది వైద్యానికి, వారి పిల్లల చదువులకు. ఈ రెండు విషయాల్లోనే వారు ఏ ప్రభుత్వం నుంచైనా ప్రోత్సాహకాలను.. మినహాయింపులను.. సబ్సిడీలను ఆశిస్తారు. వైద్య శాస్త్రం విస్తృతమయ్యాక సూక్ష్మదశలో వైద్యం అందించాల్సి వస్తోంది. ఇందుకు భారీగానే వ్యయమవుతోంది. కొన్ని సందర్భాలలో ఈ భారం సగటు జీవికి కొన్ని నెలల జీతంతో సమానమయ్యే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పేదలెవ్వరూ ఖరీదైన వైద్యం అందక అనారోగ్యంతో మృతి చెందకూడదనే దృఢ సంకల్పంతో 2007 ఏప్రిల్ ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనే బృహత్తరమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఆయన మరణానంతరం దశాబ్దకాలం తరువాత అధికారంలోకి వచ్చిన ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి మరింత ఊపిరి పోశారు. అప్పటి వరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1059 చికిత్సలను ఒక్కసారిగా 3257కు పెంచారు. అదే కాకుండా కుటుంబ తలసరి ఆదాయాన్ని రూ.ఐదు లక్షల వరకూ పెంచి ఎక్కువ కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో పాటు అప్పటి వరకూ ఆరోగ్యశ్రీ చికిత్సకు ఉన్న రూ.రెండు లక్షల పరిమితిని ఒకేసారి రూ.25 లక్షలకు పెంచి రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అటువంటి బృహత్తర పథకంగా రోగులకు అపర సంజీవినిగా మారిన ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్యసేవ)ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ వస్తోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో ఏకంగా నాలుగు సార్లు ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే రోగి కోలుకునే వరకు కుటుంబ పోషణకు ఆరోగ్య ఆసరాగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది.
సేవలపై నీలినీడలు
జిల్లాలోని 19 మండలాల పరిధిలో 28 ఆస్పత్రులు ఉండగా అందులో ప్రభుత్వ ఆస్పత్రులు 11, ప్రైవేట్ ఆస్పత్రులు 17 వరకూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కాలం నుంచి సుమారు రూ.100 కోట్ల వరకూ బకాయిలు ఉండడంతో ఈ ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు, అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్య సేవలను నిలిపివేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తొలుత సాధారణ సేవలను నిలిపివేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తారని ఆషా ప్రతినిధులు ప్రకటించడంతో ఆరోగ్యశ్రీ సేవలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనివల్ల రోగుల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
బకాయిలపై కోర్టుకు వెళ్లినా..
ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోతుండటంతో ఆస్పత్రులను నడపటం కష్టంగా ఉందంటూ నెట్‌వర్క్ ఆస్పత్రులు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. గత ఏడాది అక్టోబర్‌లో సమ్మెకు దిగిన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు అప్పట్లో ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి బకాయిలను తీరుస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయింది. అలాగే పెరిగిన ఖర్చుల దృష్టా్‌య్ ప్రొసీజర్ల ధరలు పెంచుతామన్న హామీని కూడా విస్మరించింది. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు మరోసారి సమ్మెకు ఉపక్రమించక తప్పడం లేదని ఆషా ప్రతినిధులు చెబుతున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆరోగ్యశ్రీని ఉద్దేశ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది చివరిలో ఆషా ప్రతినిధులతో వైద్యారోగ్యశాఖ బకాయిలపై చర్చలు జరిపినా నెట్‌వర్క్ ఆస్పత్రులకు స్పష్టమైన హామీ లభించలేదు.
భీమా సంస్థలకు ధారాదత్తం చేసేందుకే
రాష్ట్ర ప్రజల ప్రశంసలు అందుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్యసేవ)ని నిర్వీర్యం చేసి వైద్య సేవలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో ఆరోగ్య బీమాను ప్రవేశపడితే సామాన్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం గగనమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా దిశగా అడుగులు వేస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదలలో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్పందించని హెల్ప్ డెస్క్
ఆరోగ్యశ్రీ నిలిపివేతపై సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హెల్ప్ డెస్క్‌లలోని ఆరోగ్య (వైద్య) మిత్రల వద్దకు వెళితే వారి నుంచి స్పందన కరువవుతోంది. దీంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందుతాయో లేదోననే అందోళనను ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని వాగ్దానాలతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చాక వైద్య సేవల్ని నిర్వీర్యం చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కూటమి ప్రభుత్వం తమకు ఆరోగ్య భరోసాను కల్పిస్తున్న ఆరోగ్యశ్రీని పూర్తిగా ఆపేయాలని చూస్తోందని పేదవర్గాల ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు..
ఏరియా ఆస్పత్రులు 02
సామాజిక ప్రభుత్వ ఆస్పత్రులు 09
ప్రైవేట్ ఆస్పత్రులు 12
దంత వైద్యశాలలు 05
రూ.కోట్ల బకాయిలపై
నెట్‌వర్క్ ఆస్పత్రుల ఆగ్రహం
ఆరోగ్యశ్రీని కొనసాగించలేమంటూ ఏప్రిల్ నుంచి సమ్మెబాట
ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు
ప్రాణాలు అరచేత పట్టుకుని
నిరాశగా ఎదురుచూస్తున్న పేదలు


