పెట్రోల్‌ సెగ! | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ సెగ!

Mar 26 2026 7:30 AM | Updated on Mar 26 2026 7:30 AM

సాక్షి, అమలాపురం: పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం జిల్లాలో పలు రంగాలపై నెమ్మదిగా పడుతోంది. ఎగుమతులు నిలిచి కొబ్బరి, వనామీ రైతులు.. గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా వాసులకు తాజాగా పెట్రోల్‌.. డీజిల్‌ సెగ తగులుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు వేలాడుతుండడంతో వాహన చోదకులు హైరానా పడుతున్నారు.

జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలతో కలుపుకొని 18 మండలాల్లో సుమారు 136 పెట్రోల్‌ బంకులు ఉన్నాయని అంచనా. వీటిలో హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్పీసీఎల్‌), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (బీపీఎల్‌)తో పాటు నయారా, రిలయన్స్‌ కంపెనీలకు చెందిన బంకులు ప్రధానమైనవి. హెచ్‌పీసీఎల్‌, ఎల్‌ఓసీ కంపెనీలకు కోరుకొండ సమీపంలో ఉన్న గుమ్మళ్లదొడ్డి నుంచి డీజిల్‌, పెట్రోల్‌ వస్తుండగా బీపీఎల్‌కు వైజాగ్‌ నుంచి, నయారాకు కాకినాడ నుంచి వస్తున్నాయి.

ఆయా బంకులలో సామర్థ్యాన్ని బట్టి ప్రెటోలు, డీజిల్‌ విక్రయాలు సాగుతుంటాయి. పట్టణాలు, వాటిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు, రావులపాలెం, కొత్తపేట, తాటిపాక, ముమ్మిడివరం వంటి ప్రాంతాల్లోని ప్రధాన బంకులలో పెట్రోల్‌ రోజుకు ఎనిమిది వేల లీటర్ల నుంచి పదివేల లీటర్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఇక డీజిల్‌ నాలుగు వేల నుంచి ఐదు వేల లీటర్ల వరకు విక్రయిస్తుంటారు. చిన్న బంకులలో పెట్రోల్‌ రోజుకు మూడు వేల లీటర్ల నుంచి నాలుగు వేల లీటర్ల వరకు విక్రయిస్తుండగా, డీజిల్‌ రెండు వేల నుంచి మూడు వేల లీటర్ల వరకు ఉంటున్నాయి. చిన్నా, పెద్ద పెట్రోల్‌ బంకులు అన్నిటిలోని కలిపి జిల్లాలో సగటున రోజుకు 6.8 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్‌ సుమారు 4.08 లక్షల లీటర్ల విక్రయాలు కలిపి మొత్తం కలిపి 10.88 లక్షల లీటర్ల చమురు అమ్ముడవుతోంది. అయితే జిల్లాలో ఐ.పోలవరం మండలంతో పాటు కాకినాడకు రాకపోకలు సాగించేవారు పుదుచ్చేరి యానాంలో ఎక్కువగా పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ పెట్రోల్‌ మీద లీటరు రూ.13, డీజిల్‌ మీద రూ.10 వరకు ధర తక్కువ. దీని వల్ల రామచంద్రపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల వారు అటు కాకినాడ, ఇటు అమలాపురం రాకపోకలు సాగించేవారు యానాంలో పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేస్తుంటారు.

సరఫరా ఆలస్యం.. అతి జాగ్రత్తతో అధిక కొనుగోళ్లు

ఇజ్రాయిల్‌తో కలసి అమెరికా ఇరాన్‌పై దండయాత్ర మొదలైన తరువాత నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో గ్యాస్‌ సరఫరాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, అన్నదాన ప్రసాద కేంద్రాల వారు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీనితో పలు బంకులు మూతపడ్డాయి. నో స్టాక్‌ బోర్డులతో కనిపిస్తున్నాయి. కంపెనీల నుంచి జిల్లాలోని బంకులకు సకాలంలో ట్యాంకర్లు రావడం లేదు. ‘వారం రోజుల క్రితం వరకు ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24 గంటల కల్లా బంకుల వద్ద డెలివరీ అయ్యేది. ఇప్పుడు మూడు రోజుల సమయం పడుతోంది’ అని అమలాపురానికి చెందిన ఒక ఏజెన్సీ నిర్వాహకుడు ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాప్యంతో బంకుల వద్ద నిల్వలు నిండుకుని నో స్టాక్‌ బోర్డులు పెట్టాల్సి వస్తోందని అయన తెలిపారు. పెద్ద బంకులలో ట్యాంకర్‌ పెట్రోలు ఒక రోజు మాత్రమే వస్తోంది. ఇప్పుడు సకాలంలో రాకపోవడంతో కొరత ఏర్పడుతోంది.

జనం అతి జాగ్రత్తకు పోయి అవసరానికి మించి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేస్తుండడం కూడా కొరత ఏర్పడడానికి కారణమవుతోంది. ‘ముందు ముందు పెట్రోల్‌ దొరకదని ఫుల్‌ ట్యాంకు చేయించుకునేవారు ఎక్కువయ్యారు. రోజువారి సగటు విక్రయాల కన్నా గత రెండు, మూడు రోజుల నుంచి 30 శాతం అధికంగా విక్రయాలు సాగుతున్నాయంటే వాహన చోదకుల అతి జాగ్రత్తే కారణమని’ బంకు యజమానులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఖాలీ బాటిళ్లు, పీపాలలో లూజు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు చేయవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దేశంలో పెట్రో ఉత్పత్తులకు కొరత లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. క్షేత్రస్థాయిలో మధ్య ప్రాచ్యంలో సాగుతున్న యుద్ధం వల్ల పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సరఫరాపైన.. కొనుగోళ్లపైన పరిమితులు విధిస్తారు.. పెట్రోలు లేక బంకులు మూసేస్తున్నారు.. ఇటువంటి గాలి వాటం మాటలతో చాలా మంది అవసరం లేకపోయినా సరే చేతనైనంత నిల్వ చేసుకోవాలన్న ఆలోచనతో సమీప బంకులకు వెళ్లి పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించుకుంటున్నారు. దీంతో విక్రయాలు అమాంతం పెరిగిపోయాయి. తద్వారా బంకులు త్వరగా నిండుకుంటున్నాయి. నిజానికి మినిమమ్‌ స్టాక్‌ లెవెల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకారమే ఏ బంకు యజమానులైనా ఆయా చమురు ఉత్పత్తి సంస్థలకు ఇండెంట్లు పెట్టి సరకు తెప్పించుకుంటారు. వినియోగదారుల్లో ఈ ట్రోలింగులు, రూమర్లు విపరీతంగా వ్యాప్తి చెంది బంకులు త్వరగా ఖాళీ అయిపోతుండడంతో ఇండెంట్ల ప్రకారం సుదూర ప్రాంతాల నుంచి ట్యాంకర్లు రావడం ఆలస్యమవుతోంది. పర్యవసానంగా బంకుల వద్ద పెట్రోలు లేదన్న బోర్డులు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితి వినియోగదారులను మరింత అయోమయానికి గురి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కాకుండా స్థానిక పెట్రో సంస్థల అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పెట్రోలు, డీజిల్‌ ఉత్పత్తులకు కొరత లేదన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది.

ఆక్వా రైతుల ఆందోళన

పెట్రోల్‌, డీజిల్‌ కొరత ప్రభావం తొలిగా పడేది ఆక్వా రైతుల మీదనే. ఇప్పటికే యుద్ధం వల్ల వెనామీ రొయ్యల రేట్లు టన్నుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు తగ్గి రైతులు నష్టపోతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు డీజిల్‌ దొరకకపోతే రైతులు పంట నష్టపోయే ప్రమాదముంది. వెనామీ సాగుకు విద్యుత్‌ సౌకర్యం ఉన్నా 24 గంటలు పూర్తిస్థాయిలో సరఫరా లేదు. కోతల వల్ల ఏరియేటర్లను డీజిల్‌ మోటార్లు, జనరేటర్ల మీద నడపాల్సి ఉంది. అలాగే బోర్ల ద్వారా నీటి తోడకానికి సైతం కొంతమంది డీజిల్‌ మోటార్ల పైనే ఆధారపడుతుంటారు. ఈ సమయంలో డీజిల్‌కు కొరత ఏర్పడితే పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

యుద్ధం నేపథ్యంలో

పెట్రో ధరలు, నిల్వలపై రూమర్లు

ముందు జాగ్రత్త చర్యలతో పెట్రోల్‌ కోసం వినియోగదారుల పరుగులు

30 శాతానికి మించి పెరిగిన విక్రయాలు

ఇండెంట్‌ పెట్టిన మూడు రోజులకు కానీ బంకులకు చేరుకోలేకపోతున్న ట్యాంకర్లు

క్షేత్రస్థాయిలో వెలుస్తున్న

‘నో స్టాక్‌’ బోర్డులు

పలుచోట్ల మూసివేస్తున్న యజమానులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement