జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు

Mar 26 2026 7:30 AM | Updated on Mar 26 2026 7:30 AM

అమలాపురం రూరల్‌: జిల్లాలో పెట్రోలు, డీజిల్‌కు ఏ విధమైన కొరత లేదని జిల్లా వినియోగం ఎంతయితే ఉందో అంత పెట్రోలు డీజీల్‌ నిల్వలు బంకులకు వస్తున్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్‌ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై ఎవరూ కంగారు పడి ఎక్కువ ఆయిల్‌ తీసుకొని కృత్రిమ కొరత సృష్టించవద్దని అన్నారు. పెద్ద పెద్ద క్యాన్లలో, బాటిళ్లలో పెట్రోల్‌ పోయవద్దని, నేరుగా వాహనాల్లోకి మాత్రమే పోయాలని బంకు యజమానులకు సూచించారు.

వీవీ ప్యాట్‌, ఈవీఎంలకు నిరంతర పర్యవేక్షణ

ముమ్మిడివరం: ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదాముకు నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని జేసీ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఎయిమ్స్‌ కళాశాల మూడో అంతస్తులో గోదాములను ఆమె వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక, విద్యుత్‌ పరికరాలను పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం చేశారు.

నా ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాడతా

మాజీ మంత్రి అంబటి రాంబాబు

రాజమహేంద్రవరం సిటీ: నా ఇంటిపై దాడి చేసి, వాహనాలను తగులు పెట్టిన వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వారికి శిక్ష పడేదాకా పోరాడుతానని రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా నగేష్‌ను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తనపై అత్యంత కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో40 శాతం ఓట్లు ఉన్న పార్టీలో, 20 శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంలో నేను ఒక నాయకుడినన్నారు. ప్రభుత్వం అక్రమంగా నన్ను జైల్లో పెట్టిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎంతోమంది నాకు అండగా నిలిచారన్నారు. వారందరినీ కలిసి కృతజ్ఞత చెప్పేందుకు గోదావరి జిల్లాకు వచ్చానన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు.

నిందితులను

వదిలే ప్రసక్తి లేదు

మానవ హక్కుల చైర్‌పర్సన్‌ శైలజ

తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, ఒక వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడి ఉండటం అసాధ్యమన్నారు. పోలీస్‌శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. గిరిజన దివ్యాంగురాలిపై అఘాత్యానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement