● అట్రాసిటీ కేసు నమోదు చేసి టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్
● అప్పారావు వైఖరిపై అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన
సాక్షి, రాజమహేంద్రవరం: దళితులను కించపరుస్తూ మాజీ ఎమ్మెల్సీ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ, దళితుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఆదిరెడ్డి అహంకార తీరుకు నిరసనగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. దళితులను అవమానించిన ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఆదిరెడ్డి అహంకార పూరిత వైఖరిని ఖండిస్తూ.. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతలు, దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ఆదిరెడ్డి అరాచకాలు నశించాలని, దళితులకు క్షమాపణ చెప్పాలి, ఆదిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నివాళులు అర్పించి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు.
చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై
దాడులు పెరిగాయి : సుధాకర్‌బాబు
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తండ్రిగా, ప్రజా ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమని, వివక్షతో కూడుకున్నవన్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీలోని దళిత నేతలు ఆత్మ పరిశీలన
చేసుకోవాలి : జడ శ్రావణ్‌కుమార్
ప్రముఖ న్యాయవాది, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు దళిత వర్గాలను వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు.. ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయపరంగా ఏ స్థాయి వరకు అయినా వెళ్లి కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పారావు విషయంలో టీడీపీలోని దళిత నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అప్పారావు మాట్లాడిన విధంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడి ఉంటే.. కేసులు పెట్టి జైలుకు పంపించేవారన్నారు. దళితుని మృతదేహాన్ని ఒక వీధిలోకి రాకుండా అడ్డుకున్న ఘటన సిగ్గుచేటన్నారు.
టీడీపీకీ దళితుల రక్షణ ఆలోచన లేదా :
మాజీ ఎంపీ భరత్‌రామ్
మాజీ ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దళితులపై దూషణ, దాడుల సంఘటనలో అప్పారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఆదిరెడ్డికి టీడీపీ అధిష్టానం కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ దళితుల రక్షణపై ఆ పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం, రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్సీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితులకు వివక్ష తప్పడం లేదన్నారు. ఆదిరెడ్డిపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో స్పష్టం చేయాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి పోలీసులు విలువ ఇవ్వడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఒక వివాదంలో పెద్దమనిషిగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధి దళితులను కులం పేరుతో దూషించడం, చంపేస్తానని బెదిరించడం, దాడులు చేయడం గర్హనీయమన్నారు. కేసు కట్టేంతవరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులు ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడతారా? రాష్ట్రంలో ఏ రాజ్యాంగం నడుస్తోందని ప్రశ్నించారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు కూడా దళితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీలను టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నాయకులు ప్రదర్శనగా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ఆదిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయసారధి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నాయకులు కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న పాల్గొన్నారు.


