పాలకవర్గానికి డ్రాఫ్ట్ కాపీ అందజేత
రావులపాలెం: కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రపంచ నాణ్యత ప్రమాణాలు (ఐఎస్‌ఓ) సర్టిఫికెట్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామపంచాయతీ దక్కించుకుంది. కొద్ది నెలలుగా ఈ సర్టిఫికెట్‌కు సంబంధించి ఈ పంచాయతీ చేపట్టిన ప్రయత్నం ఫలించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 పంచాయతీలు పోటీ పడగా రావులపాలెం పంచాయతీ దానిని దక్కించుకుంది. మూడు రోజులుగా కేరళకు చెందిన ఐఎస్‌ఓ ఆడిట్ బృందం ప్రేమానంద్ సీఎం, సలీం కెమ్, రాష్ట్ర పంచాయతీరాజ్ కోఆర్డినేటర్ ఇమామ్ పలు రికార్డులు పరిశీలించి, క్షేత్రస్థాయి పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్టిఫికెట్‌ను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి వారం రోజుల అనంతరం అధికారిక సర్టిఫికెట్ రానుంది. సర్పంచ్ తాడేపల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శ్రీనివాస్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ చిలువూరి సతీష్ రాజు తదితరులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, దాతలు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే ఈ ఘనత దక్కిందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఎల్.దుర్గాప్రసాద్ కృషి ప్రశంసనీయమని వారు కొనియాడారు.


