ఫ బాలుడి మృతి
ఫ ఎనిమిది మందికి గాయాలు
కాకినాడ రూరల్: పుట్టిన రోజు వేడుకలో వారంతా సరదాగా గడిపారు.. తిరిగి తమ ఇళ్లకు బయలు దేరారు.. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఓ బాలుడిని బలి తీసుకుంది. అలాగే మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ప్రతాప్‌నగర్ వంతెన వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాలుడు పలివెల అక్షంత్ (10) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి ఆటోలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు 9 మంది ఆటోలో కాకినాడకు వచ్చారు. కాకినాడలో రెండు గదులు అద్దెకు తీసుకుని, అక్కడ వేడుకల అనంతరం వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రతాప్‌నగర్ వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సామర్లకోట బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్షంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు.


