ఫ వేములోవలోనే పెద్ద పులి సంచారం
ఫ అప్రమత్తంగా ఉండాలని అధికారుల ప్రచారం
గంగవరం: పెద్ద పులి ఎక్కడా ఆగడం లేదు.. రోజుకోచోట ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం గంగవరం మండలంలో దాని జాడలను అధికారులు గుర్తిస్తున్నారు. మూడు రోజులుగా గంగవరం మండలం వేములోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి ఓ ఆవు దూడను హతమార్చింది. సోమవారం పెద్దపులి గంగవరం మండలం వేములోవ రిజర్వు ఫారెస్ట్‌లోని ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, వేములోవ అటవీ ప్రాంతంలోనే సంచరించినట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్‌ఓ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని కనుగొన్నామని, అటవీ ప్రాంతంలోనే ఉందని ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్నారు. వేములోవ – ఉయ్యాలమడుగు, గొరగుమ్మి అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందన్నారు. బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. దీనికోసం శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా బయటకు రావొద్దని ప్రచారం నిర్వహించారు. ఫోక్స్‌పేట ఫారెస్ట్ రేంజర్ పి.శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.
జీడిమామిడి రైతుల్లో గుబులు
గంగవరం మండలంలో జీడిమామిడి సాగు చేసే రైతులు ఆ తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆర్‌డీ పురం, పిడతమామిడి, వడ్డిచెరువు, పెదగార్లపాడు, చినగార్లపాడు, చిన్నంపాలెం, గొరగుమ్మి, లక్కొండ, గంగవరం తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులు, మహిళలు జీడి పిక్కలు సేకరించేందుకు వెళ్లడం లేదు. దీంతో సర్వత్రా భయాందోళన నెలకొంది.


