తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Mar 24 2026 7:03 AM | Updated on Mar 24 2026 7:03 AM

రూ.20 లక్షల విలువైన ఆభరణాలు మాయం

సామర్లకోటలో సంఘటన

సామర్లకోట: స్థానికంగా ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..

సామర్లకోట అంబటివారి తోటలోని తన ఇంట్లో విశ్రాంత ఉపాధ్యాయురాలు మట్టిపల్లి లక్ష్మీదేవి (82) ఉంటున్నారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి బంధువులతో కలసి హైదరాబాద్‌లో పెళ్లికి వెళ్లారు. బంధువులు తిరిగి సామర్లకోట వచ్చినప్పటికీ లక్ష్మీదేవికి జ్వరంగా ఉండడంతో హైదరాబాద్‌లో ఉండిపోయారు. రోజూ పని మనిషి సాయంత్రం వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుంది. సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించింది. వెంటనే సమీపంలోని లక్ష్మీదేవి బంధువు వజ్జులు మాస్టారుకు సమాచారం ఇచ్చింది. ఇంటి వద్దకు చేరుకున్న ఆయన దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎ.కృష్ణభగవాన్‌, ఎస్సై రాజా, క్రైం ఎస్సై కృష్ణారావు, సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కృష్ణభగవాన్‌ హైదరాబాద్‌లో ఉన్న లక్ష్మీదేవికి ఫోన్‌ చేసి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 గ్రాముల బంగారు, మూడు కిలోల వెండి, రూ.50 వేల నగదు బీరువాలో ఉంచినట్లు ఆమె వివరించారు. దొంగలు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి, ఇంటి తాళాలు బద్దలు కొట్టి బీరువాలోని వెండి, బంగారం, నగదును తస్కరించారు. సుమారు ఏడాది క్రితం తన భర్త వెంకట్రావు చనిపోవడంతో ఆయన పేరున బ్యాంకు లాకరులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఇటీవల ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రపరిచినట్లు బాధితురాలు తెలియజేసింది. పెళ్లి నిమిత్తం కొన్ని బంగారు ఆభరణాలను వెంట తీసుకువెళ్లానన్నారు. వేలిముద్ర నిపుణులు వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన కొత్తవారి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement