తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి? | - | Sakshi
Sakshi News home page

తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?

Mar 24 2026 7:03 AM | Updated on Mar 24 2026 7:03 AM

18 మంది పురోహితులకు

నోటీసులపై వివాదం

దేవస్థానం చైర్మన్‌, ఈఓలను కలిసిన వైనం

అన్నవరం: స్థానిక సత్యదేవుని దేవస్థానం వ్రత విభాగంలో వ్రత పురోహితుడు చేతివాటం ప్రదర్శించి, రూ.రూ.58.39 లక్షలు కాజేసిన వ్యవహారంలో తమ పాత్ర ఉందని దేవస్థానం అధికారులు నోటీసులు ఇవ్వడంపై 18 మంది పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాల మేరకు ఈఓ వి.త్రినాథరావు ఈ నెల 17న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాల్లోకి వెళ్తే.. దేవస్థానం వ్రత విభాగంలో పురోహితుల పారితోషికం చెల్లింపు వ్యవహారం చూడాల్సిన ఆ సెక్షన్‌ గుమస్తా విధులను అనధికారికంగా ఒక పురోహితుడు చాలా ఏళ్లుగా నిర్వహిస్తూ, రూ.58.39 లక్షల అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సెక్షన్‌ గుమస్తా, సూపరింటెండెంట్‌, ఆపై ఏఈఓ, తదితర అధికారులు ఆ పురోహితుడు తయారు చేసిన పారితోషికం బిల్లులపై సంతకాలు చేసేవారు. ఇది ఆసరాగా తీసుకున్న ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి 2025 నవంబర్‌ వరకూ అవకతవకలకు పాల్పడ్డాడు. ఆ పురోహితుడు 18 మంది వ్రత పురోహితులకు వారి పారితోషికం కన్నా సుమారు రూ.25 లక్షలు ఎక్కువగా వారి అకౌంట్లకు జమ చేయించాడు. ఆ తరువాత మీ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయ్యిందని చెప్పి, తిరిగి ఆ మొత్తాన్ని తన అకౌంట్‌కు జమ చేయించుకున్నాడు. అధికారులు ఈ విషయం గుర్తించి అతడిని నిలదీయడంతో ఆ మొత్తంలో రూ.28 లక్షలు చెల్లించాడు. తరువాత గత డిసెంబర్‌లో అతను చనిపోయాడు. ఇదిలా ఉంటే అధికారులు తిరిగి రూ.25 లక్షలు కట్టాలని 18 మంది వ్రత పురోహితులకు నోటీసులు ఇచ్చారు. అదనంగా పంపిన మొత్తాన్ని ఆ పురోహితుడికి పంపేశామని వారు ఆధారాలు చూపించారు. అయితే మీరు చెల్లించాల్సింది దేవస్థానానికి తప్ప ఆ పురోహితునికి కాదని దేవస్థానం అధికారులు చెప్పడంతో వారంతా తిరిగి రూ.25 లక్షలు దేవస్థానానికి చెల్లించారు. దీంతో వ్యవహారం ముగిసిపోయిందని అంతా భావించారు.

కుమ్మక్కు అయ్యారంటూ..

అవకతవకలకు పాల్పడిన పురోహితునితో కుమ్మక్కు అయ్యారంటూ 18 మంది పురోహితులకు ఈ నెల 17న నోటీసులు ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరు శనివారం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ను, సోమవారం ఈఓ త్రినాథరావును కలసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయిన విషయం వాస్తవమేనని, వెంటనే ఆ పురోహితునికి చెల్లించేశామని, విషయం వెలుగులోకి వచ్చాక తిరిగి దేవస్థానానికి కూడా చెల్లించామని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారంటున్నారు. చేతివాటం ప్రదర్శించిన పురోహితుడితో కుమ్ముక్కై తమ అకౌంట్లలో ఎక్కువ పారితోషికం జమైనా అధికారులకు తెలపలేదనే అభియోగంపై పురోహితులకు దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు నోటీసులిచ్చామని ఈఓ త్రినాథరావు తెలిపారు. వారి జవాబులను బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement