శివారు అవస్థలు
అమలాపురం– చల్లపల్లి ప్రధాన పంట కాలువ నుంచి కె.పెదపూడి చానల్ మీదుగా అంబాజీపేట మండలం గంగలకుర్రు బీసీ హాస్టల్ వద్ద వరిచేలు నీరందాలి. ఇది శివారు ప్రాంతం. ఈ కాలువ పొడవునా కొబ్బరి తోటలు ఉండడం, ఎండలు పెరగడంతో ఇక్కడకు నీరు వచ్చే అవకాశం లేదు. సాగు చేయాలంటే మోటార్లే ఆధారం. పంట కాలువ వ్యవస్థ ఉన్నా చుక్క నీరందడం లేదు. సాగు చేయకుండా వదిలేయక ఇలా మోటార్ల మీద సాగు చేస్తున్నా వాటి ద్వారా కూడా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
● కాలువలకు ఫుల్లు
● శివారుకు అరకొరే
● మెరక పొలాలకు నీటి ఎద్దడి
● పంటలను రక్షించుకునేందుకు
రైతుల అవస్థలు
సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ అవసరాలకు మించి సాగునీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు గొప్పగా చెబుతున్నారు. కానీ డెల్టాలోని శివారుల్లో అరకొరగా అందుతున్న నీరు చేలకు చేరకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యుత్ మోటార్లతో భూగర్భ జలాలు, మురుగునీటి కాలువలు, వృథా నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నారు. తాజాగా పడిన వర్షంతో జిల్లాలోని రైతులు కొంత ఊరట చెందినా, పంట చేలు గింజ గట్టి పడే దశలో మున్ముందు సమృద్ధిగా సాగు నీరందకపోతే దిగుబడిపై ప్రభా వం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
జిల్లా పరిధిలో..
జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాలలో మొత్తం 1.82 లక్షల ఎకరాల ఆయకట్టులో రబీ వరిసాగు జరగాల్సి ఉంది. వరిని కాదని కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడంతో వరి ఆయకట్టు అంచనా 1.69 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఫిబ్రవరి మూడో వారంలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. అయితే నాట్ల్ల సమయంలోనే రబీలో శివారు, మెరక ప్రాంతాలలో చేలకు నీరందక రైతులు పాట్లు పడ్డారు.
మెరక పొలాలకు అందని నీరు
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మూడు డెల్టాలకు కలిపి రోజుకు 11,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 2,200, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. అయినా శివారు, మెరక పొలాలకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. దీనితో రైతులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నీటి సేకరణ చేసుకుంటున్నారు. పంట కాలువలు ఆధ్వానంగా ఉండడంతో పాటు వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. దీని వల్ల చేలకు తరచూ తడులు అందించాల్సి ఉంది. ఇదే సమయంలో తీర ప్రాంతాల్లో రైతులు ఆక్వా చేలకు, మరీ ముఖ్యంగా చేపల సాగు చేసే రైతులు మోటార్లతో నీరు పెద్ద ఎత్తున చెరువులకు మళ్లిస్తున్నారు. మెరక ప్రాంతాల్లో కొబ్బరి తోటలు, అరటి వంటి ఉద్యాన పంటలకు సైతం నీరు మళ్లిస్తుండడంతో శివారు, మెరక చేలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం ఎద్దడికి గురవుతున్న ప్రాంతాలన్నీ ప్రధాన పంట కాలువలకు అనుబంధంగా ఉన్న చానళ్ల శివారు ప్రాంతాల్లోనివే. ఇదే పరిస్థితి కొనసాగితే చానళ్లు మొదలయ్యే ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అంబాజీపేటలో కురుస్తున్న వర్షం
ఊరటనిచ్చిన వర్షాలు
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో గంట పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీని వల్ల ఈ నియోజకవర్గాల పరిధిలో శివారుల్లో కొంత వరకు రైతులకు నీటి బాధలు తప్పాయి. అయితే ఇది తాత్కాలికమేనని రైతులు చెబుతున్నారు. వర్షాలు తగ్గి ఎండలు పెరిగితే ఇబ్బందులు తప్పవని రైతులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంట కాలువల్లో పూడిక తొలగింపు చేయడంతోపాటు శివారుకు అధికంగా నీరిచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


