నేడు ఈద్‌ ఉల్‌ ఫితర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఈద్‌ ఉల్‌ ఫితర్‌

Mar 21 2026 4:59 AM | Updated on Mar 21 2026 4:59 AM

ముగిసిన రంజాన్‌ మాసం

మసీదుల్లో ప్రార్థనలకు పూర్తయిన ఏర్పాట్లు

కొత్తపేట: పవిత్ర రంజాన్‌ మాసం ముగిసింది. షవ్వాల్‌ నెల ప్రారంభ సూచికగా శుక్రవారం సాయంత్రం చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్‌ నమాజ్‌కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పండగ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు పాటిస్తూ, నమా, సహర్‌, ఇఫ్తార్‌, ఖురాన్‌ పఠనం, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపారు.

ఈద్‌ నమాజుకు సిద్ధం

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ నమాజ్‌ కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గాలతో పాటు మసీదుల్లో ప్రార్థనలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈద్‌ ఉల్‌ ఫితర్‌ నమాజ్‌ చేస్తారు. నెల రోజుల తమ ప్రార్థనలు ఫలించాలని, సర్వమానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ దువా చేస్తారు. రంజాన్‌ మాసంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. ధనికులతో పాటు పేదలు సైతం పండగ ఆనందంగా చేసుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సమాజ్‌కు ముందే ఫిత్రా ఇచ్చేయాలి. రంజాన్‌లో జకాత్‌ ఇస్తే 70 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందని ముస్లింల విశ్వాసం.

ఫిత్రా దానం ప్రధానం

రంజాన్‌ సందర్భంగా పేదలకు దానం చేయడమే ఫిత్రా, దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని అభాగ్యులకు ఫిత్రా దానం ఇవ్వాలి. సద్గ–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లా కల్పిస్తారంటారు. పండగకు ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పడే పుట్టిన బిడ్డ మొదలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున వేర్వేరుగా ఫిత్రా దానం చేయాలి.

సర్వం సిద్ధం

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా జిల్లాలో సామూ హిక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంప్రదాయం ప్రకారం ముస్లింలు ఖర్జూర పండు తిని, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుకుని ప్రార్థనా స్థలానికి చేరుకుంటారు. అక్కడ సామూహిక ఈద్‌ నమాజ్‌ చదివి, అనంతరం పరస్పరం అలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. ప్రార్ధనా స్థలానికి అల్లా నామం స్మరిస్తూ ఒక మార్గం నుంచి వెళ్లి, వేరే మార్గం ద్వారా ఇంటికి చేరుకుని సేమియా పాయసం సేవిస్తారు. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికీ సేమియా పంపిణీ చేసి, తమ ఆత్మీయతను చాటుకుంటారు. చిన్న పిల్లలకు ఈద్‌ కానుకలు బహూకరిస్తారు.

మార్గదర్శకం

గడచిన మాసంలో చేసిన ఉపవాస దీక్షలు, సమాజులు, దానాలు సంకల్ప సిద్ధిని చేకూర్చుతాయి. రంజాన్‌ మాసంలో అనుసరించిన నియమ నిష్టలు, ప్రత్యేక ప్రార్థనలు మానవాళి సత్ప్రవర్తనకు మార్గదర్శకంగా దోహదపడతాయి. ఖురాన్‌ పఠనం వల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో జీవిస్తారు. కుల, మత, వర్గ రహితంగా సమాజంలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడుతుంది.

– షేక్‌ గౌస్‌, మండల ముస్లిం

సంఘ నాయకుడు, కొత్తపేట

పేదలకు చేతనైన సాయం

రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో జన్మధన్యమవుతుంది. రంజాన్‌ పర్వదినం ముస్లింలకు ఎంతో ప్రధానమైనది. అల్లా దివ్య సందేశాలను ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరించాలి. పండగ పూట ఏ ఒక్కరూ పస్తులు ఉండకూడదు. ఆకలి విలువ తెలియజేసేదే రంజాన్‌ ఉపవాస దీక్ష. ప్రతి ముస్లిం చుట్టుపక్కల ఉన్న పేదలకు చేతనైన సాయం చేయాలి. తనతో పాటు వారూ సంతోషంగా పండగ చేసుకునేలా దానధర్మాలు చేయాలి.

– షేక్‌ ఖాజాబాబు, ప్రెసిడెంట్‌, మసీదు,

షాదీఖానా కమిటీ, కొత్తపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement