ఉగాది నాటికలు.. సందేశాత్మకాలు | - | Sakshi
Sakshi News home page

ఉగాది నాటికలు.. సందేశాత్మకాలు

Mar 21 2026 4:59 AM | Updated on Mar 21 2026 4:59 AM

రెండో రోజూ కొనసాగిన పోటీలు

మూడు నాటికల ప్రదర్శన

రావులపాలెం: ఉగాదిని పురస్కరించుకుని రావులపాలెంలోని కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ (సీఆర్‌సీ) కాటన్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సీఆర్‌సీ కళావేదికలో నిర్వహిస్తున్న 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు విశేషంగా అలరిస్తున్నాయి. రెండో రోజు శుక్రవారం పోటీలను తిలకించేందుకు పరిషత్‌ గౌరవ అధ్యక్షుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి, నటులు రాజీవ్‌ కనకాల, గౌతంరాజు, గుండు సుదర్శన్‌ హాజరయ్యారు. వారు జ్యోతి వెలిగించి నాటికలను ప్రారంభించారు. రెండో రోజు మూడు నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన చేసిన చేసిన బాలికలకు సినీ, రాజకీయ ప్రముఖులు, సీఆర్‌సీ సభ్యులు ప్రశంసా పత్రాలను అందజేశారు. నాటకాల ఏర్పాట్లను సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, సీఆర్‌సీ రూపశిల్పి విక్టరీ వెంకటరెడ్డి, నాటక కళాపరిషత్‌ డైరెక్టర్‌ కె.సూర్య, సీఆర్‌సీ డైరెక్టర్లు మల్లిడి విజయ భాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్‌రెడ్డి, సత్తి సూర్యభాస్కరరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, నడింపల్లి సుబ్బరాజు, పడాల సత్యనారాయణరెడ్డి, పరిషత్‌ పర్యవేక్షణ డైరెక్టర్‌ పలివెల త్రిమూర్తులు పర్యవేక్షించారు.

ఆకట్టుకున్న ‘సహన’

న్యాయం కోసం తండ్రీ కూతురు చేసిన పోరాటమే అంశంగా సహన నాటిక సాగింది. గుంటూరు అభినయ ఆర్ట్స్‌ ప్రదర్శించిన నాటికను స్నిగ్ధ రచించగా, ఎన్‌.రవీంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. తమకు ఎదురైన సమస్యలకు ఆ తండ్రీ కూతురు నిరంతరం ప్రశ్నించబడుతూ, ఆ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు పేర్చుకుంటూ, సహనంతో అధిగమిస్తూ న్యాయం కోసం అడుగులు వేసిన తీరు ఎంతో ఆకట్టుకుంది.

ఆలోచింపజేసిన ‘చిటికెన వేలు’

విశాఖపట్నం తెలుగు కళా సమితి వారు చిటికెన వేలు నాటికను ప్రదర్శించారు. అట్టాడ అప్పల నాయుడు రచించగా, చలసాని కృష్ణ ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. కొండ ప్రాంతంలో సరస్సు ఆధారంగా గిరిజన గూడెం చుట్టూ తిరిగిన కథ ఇది. రోజులు మారడంతో వారి పద్ధతులు కూడా మారిపోయి, కొత్త పుంతలు తొక్కాయి. సోమన్న, రెంజిన్‌, బుద్ధుడు పాత్రలు ఆకట్టుకున్నాయి.

అంతా నిజం కాదు

విశాఖపట్నం చైతన్య కళా స్రవంతి ప్రదర్శించిన ఆ సత్యం నాటిక సందేశాత్మకంగా సాగింది. పిన్నమనేని మృత్యుంజయరావు రచించగా, పి.బాలాజీ నాయక్‌ దర్శకత్వం వహించారు. ప్రతి సత్యం వెనుక, ప్రతి అసత్యం వెనుక మనిషి స్వార్థం ఉంటుందని, భయమే చుట్టుకుని ఉంటుందని, అది అతడికి కీడో, మేలో చేస్తోందని చక్కగా వివరించారు. సత్యమైనా, అసత్యమైనా కంటికి కనిపించేదంతా నిజం కాదని, ఒక్కోసారి అసత్యం కూడా మంచి జరుగుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement