పి.గన్నవరం మండలం వై.వి.పాలెంలో జోరుగా సాగుతున్న తువ్వ మట్టి తవ్వకాలు
ఆలమూరు మండలం జొన్నాడ వద్ద నిర్మాణంలో నిలిచిపోయిన ఫ్లై ఓవర్
సాక్షి, అమలాపురం: ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్న జొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల వల్ల స్థానికులు, 216–ఏ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించేవారు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ఈ దీని నిర్మాణం మాత్రం మట్టి అక్రమ తవ్వకం దారులకు అక్షయపాత్రగా మారింది. ఫ్లై ఓవర్ నిర్మాణంలో కీలకమైన అప్రోచ్ రోడ్డు కోసం అనుమతులు పొంది, మట్టిని ఇటుక బట్టీలకు, తువ్వ ఇసుకను లే అవుట్ చదును చేసేందుకు రవాణా చేస్తూ అక్రమార్కులు రూ.కోట్లు దండుకుంటున్నారు.
రావులపాలెం– రాజమహేంద్రవరం మధ్య ఉన్న 216–ఏలో భాగంగా నిర్మిస్తున్న జొన్నాడ ఫ్లై ఓవర్ మట్టి అక్రమార్కులకు వరంగా మారింది. 2020లో నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ ఫ్లై ఓవర్ నిర్ణీత షెడ్యూలు ప్రకారం 2024 నాటికి పూర్తి కావాల్సి ఉంది. దీని తరువాత ప్రారంభించిన రాజమహేంద్రవరం నగర శివారు మోరంపూడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయ్యింది. ఏడాది క్రితమే వినియోగంలోకి కూడా వచ్చింది. జొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు మాత్రం పూర్తి కాలేదు. కానీ కూటమి పార్టీ నేతలు సొంతంగా సంపద సృష్టించుకునేందుకు మాత్రం ఈ ఫ్లై ఓవర్ అక్కరకొచ్చింది. కీలకమైన అప్రోచ్ రోడ్డుకు మట్టి కావాల్సి ఉందని, దానిని సేకరించేందుకు అంటూ రెండేళ్లుగా అనుమతులు పొందుతున్నారు. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారి పాలెం మీదుగా ఎల్.గన్నవరం పరిధిలో, ఊడిమూడిలంకల్లో అనుమతులు పొందుతున్నారు. తరువాత వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధుల సన్నిహితుల కనుసన్నలలో ఇక్కడ మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. వీరికి స్థానిక అధికార పార్టీ నేతల ఆశీస్సులు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఇదే పంథాను అనుసరిస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఎల్.గన్నవరం వద్ద ఎకరం భూమిలోను, ఊడిమూడిలంక వద్ద రెండు ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు అనుమతులు పొందారు. ఎల్.గన్నవరంలో తువ్వ ఇసుకను సేకరించి లే అవుట్‌ల ఫిల్లింగ్‌కు అమ్మేస్తున్నారు. ఊడిమూడిలంకలో మట్టి సేకరించి లే అవుట్‌లకు, ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వద్ద ఇటుక బట్టీలకు, లే అవుట్‌ల సైట్ ఫిల్లింగ్‌లకు దొడ్డిదారిన అమ్మున్నారు. తువ్వ ఇసుక రోజుకు 30 నుంచి 40 లారీల వరకు తరలిస్తుండగా, ఊడిమూడిలంక వద్ద పది నుంచి ఇరవై లారీల మట్టి తరలిపోతోంది. దీనిలో ఒక్క లారీ మట్టి, తువ్వ ఇసుకను కూడా జొన్నాడ ఫ్లై ఓవర్ వద్ద డంప్ చేయకపోవడం గమనార్హం. అప్రోచ్ పనులు ఇటీవల మొదలయ్యాయి. నిర్మాణ సంస్థ అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతం ఫ్లై యాష్‌ను మాత్రమే వినియోగిస్తోంది. తువ్వ ఇసుక, మట్టి వినియోగిస్తున్న దాఖలాలు లేవు. పది రోజులుగా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున లారీల మీద వెళుతున్న తువ్వ ఇసుక, మట్టి ఎక్కడకు వెళుతోందనేది అధికారులు పట్టించుకోవడం లేదు.
మట్టి అక్రమ రవాణాకు అప్రోచ్ కలరింగ్
జొన్నాడ ఫ్లై ఓవర్ వద్ద అప్రోచ్ రోడ్డు
కోసం అంటూ అనుమతులు
దొడ్డిదారిన ఇటుక బట్టీలు..
లే అవుట్‌ల ఫిల్లింగ్‌కు తరలింపు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైన కొత్త తరహా దోపిడీ
ఎల్.గన్నవరం, ఊడిమూడిలంకలో తవ్వకాల జోరు
ఇప్పటికే నదీ కోత తీవ్రతరం
తాజాగా మట్టి తవ్వకాలు
గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
రోజుకు 40 నుంచి 50 లారీలలో రవాణా
ఫ్లై ఓవర్ పనులకే వాడాలి
మట్టిని జొన్నాడ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు మాత్రమే వినియోగించాలి. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు అవసరమైన మట్టి సేకరణకు ఇక్కడ తవ్వకాలకు తాత్కాలికంగా అనుమతులు మంజూరు చేశాం. ఇక్కడ తవ్వకాల చేసే మట్టిన ఆ పనికి మాత్రమే వినియోగించాల్సి ఉంది. పక్కదారి పట్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
– పి.శ్రీపల్లవి, తహసీల్దార్, పి.గన్నవరం
ఎమ్మెల్యే సొంత ఊరిలోనే...
గోదావరి లంకల మధ్య సాగుతున్న ఈ తవ్వకాలు ఆయా గ్రామాలకు పెను ముప్పుగా మారాయి. వశిష్ఠ నదీపాయ మధ్య ఉన్న ఈ లంక గ్రామాలకు నదీకోత పెను ముప్పుగా మారింది. ఏటా వరద ఉధృతికి లంక భూములు గోదావరిలో కలిసి పోతున్నాయి. దీనికి మట్టి తవ్వకాలు తోడు కావడంతో ఈ గ్రామాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా అనుమతులు మంజూరు చేసిన రెవెన్యూ, మైనింగ్, గోదావరి లంక గ్రామాల్లో జరిగే కార్యకలాపాలపై నిఘా పెట్టాల్సిన ఇరిగేషన్ శాఖలకు చెందిన అధికారులు నోరు మెదపడం లేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. మట్టి తవ్వకాలు జరుగుతున్న ఊడిమూడిలంక ప్రస్తుత పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సొంత ఊరు కావడం విశేషం.


