అమలాపురం రూరల్ : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనా అన్నారు. కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎస్పీ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ మహిళా రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి డి. శ్రీనివాసరావు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేవీడీ ప్రసాద్ ప్రసంగిస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘమన్నారు. అడ్మిన్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఆపద సమయంలో 1098 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చన్నారు. డీపీఓ శాంత లక్ష్మి మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర ప్రసంగిస్తూ మహిళలపై వివక్షను నిర్మూలించేందుకు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పక్కగా అమలవుతోందన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ పర్య వేక్షక ఇంజనీర్ బి రాజేశ్వరి, సహాయ లేబర్ కమిషనర్ టీ నాగలక్ష్మి ప్రసంగించారు. ఐసీడీఎస్ పీడీ నాగమణి, డీఆర్‌డీఏ పీడీ రాంబాబు, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, మార్క్ షెడ్ సహాయ సంచాలకులు మంజుల, ఎల్‌డీఎం కేశవ్‌వర్మ పాల్గొన్నారు.
అదే నిజమైన
మహిళా దినోత్సవం
ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: మహిళా దినోత్సవం అంటే డ్వాక్రా తదితర విభాగాల మహిళలను సత్కరించడం కాదు... మహిళా రైతులుగా, కూలీలుగా ఉన్న వారిని గుర్తించి వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం కంటే జనవరి 18న శ్రామిక మహిళల దినోత్సవం జరుపుకునే రోజు ఒకటి ఉన్నా దానిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామీణ భారతంలో అధిక శాతం మహిళలు వ్యవసాయ రంగంలో సాగుదారులుగా, కౌలుదారులుగా, కూలీలుగా ఉన్నారని గుర్తు చేశారు. జనవరి 18న వీరంతా తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు దేశ ఆర్ధిక, ఆహార భద్రత విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. మహిళా కూలీలుగా ఉన్న వారికి కనీసం వేతనం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ నాయకులపై ఫిర్యాదు
అమలాపురం రూరల్: కె.గంగవరం మండలం శేరులంకలోని ఎస్సీ కులానికి చెందినవారి 100 ఎకరాల కొబ్బరితోటను ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, అతని సోదరుడు, మరో కొంతమంది ఆక్రమించారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ ఆక్రమణలపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అమలాపురంలో ఎస్సీల లంక భూములను కూడా ఆక్రమించారని, దళితులకు న్యాయం చేయాలని కోరారు.


