హోటళ్ల యాజమానులకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య సూచన
అమలాపురం టౌన్: పట్టణంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు ఇక నుంచి యూజ్డ్ ఆయిల్‌ను రుకో రీ యూజ్డ్ కుకింగ్ సంస్థకు అందజేయాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వై.రామయ్య సూచించారు. స్థానిక ఏబీసీడీ ఫుడ్ కోర్టులో పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులతో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో రామయ్య మాట్లాడారు. పట్టణ రెస్టారెంట్స్ యూనియన్ అధ్యక్షుడు నల్లా పవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వర ప్రసాద్, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు పాల్గొని యూజ్డ్ ఆయిల్‌పై చర్చించారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉపయోగించిన ఆయిల్‌ను రుకో అనే అవుట్ సోర్సింగ్ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా అప్పగించారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య తెలిపారు. ఇలా సేకరించిన యూజ్డ్ ఆయిల్‌తో సంబంధిత కాంట్రాక్టు సంస్థ బయో డీజిల్ తయారు చేస్తుందని వివరించారు. ఆహార నాణ్యత, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ విధానాన్ని యాజమానులు పాటించాలని సూచించారు. రుకో సంస్థ ఇచ్చిన ప్రత్యేక టిన్‌ల్లో యూజ్డ్ ఆయిల్‌ను ఉంచితే సంబంధిత సంస్థ సిబ్బంది నెలా నెలా సేకరిస్తారన్నారు. రుకో సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. అనంతరం హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమక్షంలో వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. చివరగా రుకో సంస్థ బ్రోచర్లు, టిన్‌లను రామయ్యతోపాటు హోటళ్ల యాజమానులు విడుదల చేశారు. సమావేశంలో పట్టణ రెస్టారెంట్ యూనియన్ కార్యదర్శి కోకా రాంబాబుతో పాటు యూనియన్ ప్రతినిధులు యెండూరి కార్తీక్, వంశీ, బాబి, సంతోష్‌కుమార్, శేఖర్, రాజేష్, సురేష్, హరిబాబు, శంకర్ పాల్గొన్నారు.


