కాకినాడ క్రైం: కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ విడుదల ఉద్యోగ ప్రకటనలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ మేరకు కాకినాడ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరసింహనాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్‌ఐసీ మెరిట్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్య కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఎన్‌ఐజీ మెరిట్ జాబితా ఈస్ట్‌గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్, కాకినాడ.ఏపీ.జీఓవీ.ఇన్, కోనసీమ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రత్నగిరిపై, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారు జామున వివాహాలు జరగడంతో నవ దంపతులు, వారి బంధు మిత్రులు కూడా సత్యదేవుని దర్శనానికి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఈ ఒక్కరోజే దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. రెండు వేల మంది సత్యదేవుని వ్రతాలు ఆచరించారు. ఒక్క వ్రతాల విభాగం ద్వారానే దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం రాగా, ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.15 లక్షలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు 40 వేల మంది భక్తులు విచ్చేస్తారని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించనున్నారు.


