ఆత్రేయపురంలో కల్తీకి చోటు లేదు | - | Sakshi
Sakshi News home page

ఆత్రేయపురంలో కల్తీకి చోటు లేదు

Mar 6 2026 8:18 AM | Updated on Mar 6 2026 8:18 AM

– పూతరేకుల వ్యాపారులు

ఆత్రేయపురం: స్థానిక పూతరేకుల వ్యాపారంలో కల్తీకి చోటు లేదని ఆత్రేయపురం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ పూతరేకుల వర్తక సంఘం పేర్కొంది. సంఘం ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పూతరేకుల్లో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఒక చానల్‌లో వచ్చిన తప్పుడు కథనంపై సమావేశం నిర్వహించి యూనియన్‌ పరంగా నివారణ చర్యలు చేపట్టినట్టు సంఘ అధ్యక్షులు బసవయ్య, కార్యదర్శి చెన్నం సురేష్‌ తెలిపారు. ఆత్రేయపురంలో పూతరేకుల వ్యాపారులందరూ బ్రాండెడ్‌ నెయ్యిని వాడుతున్నారని తెలిపారు. కొందరు దురదృష్టవశాత్తూ పూతరేకుల పరిశ్రమను అప్రతిష్ట పాలు చేయడానికి కల్తీ నెయ్యి అనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాటికి ఏమాత్రం ఆధారాలు లేవని, ఇక్కడ ఎక్కువ ఉంది సంప్రదాయంగా స్వచ్ఛమైన నెయ్యితో పూతరేకులు తయారు చేస్తున్నారని తెలియజేశారు. ఆత్రేయపురం పూతరేకుల వ్యాపార ప్రతిష్టకు ఈ దుష్ప్రచారం తీవ్ర నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమపై ఆధారపడి ఎందరో పేద కుటుంబాల మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎవరైనా కల్తీ నెయ్యి వినియోగిస్తే వారిపై పూతరేకులు వర్తక సంఘం కఠిన చర్యలు తీసుకుని వ్యాపారం నుండి బహిష్కరిస్తామని హెచ్చరించారు. తొలుత పూతరేకుల వ్యాపారులు ఆత్రేయపురం కాలువ రేవు, బస్టాండ్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయించాల్సిందిగా తహసీల్దార్‌ వడ్డీ రామచంద్రమూర్తి, ఎంపీడీవోల బీకేఎస్‌ఎస్‌వీ రామన్‌లకు ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. ఈ ప్రాంతంలో ఎవరూ కల్తీ నెయ్యి కొనవద్దు, వాడవద్దు, అమ్మ వద్దు అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement