బడదాంలో పులి సంచారం | - | Sakshi
Sakshi News home page

బడదాంలో పులి సంచారం

Mar 5 2026 7:23 AM | Updated on Mar 5 2026 7:23 AM

అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి

పులి పాదముద్రలను అనుసరించి

సాగుతున్న అటవీ అధికారులు

అడ్డతీగల: జిల్లాలో రోజుకొక ప్రాంతంలో సంచరిస్తూ ఆదివాసీలను భయభ్రాంతులను చేస్తున్న పెద్ద పులి బుధవారం అడ్డతీగల–గంగవరం మండలాల సరిహద్దు గ్రామాల్లోనికి ప్రవేశించినట్లు నిర్ధారణ అయ్యింది. నీటి కోసం వెతుకులాడుతూ కొత్త ప్రాంతాల్లోకి ప్రవేశిస్తోంది. అడ్డతీగల అటవీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని సూదికొండ అటవీ క్షేత్రం కిందకి వచ్చే లక్కొండ–గొరగొమ్మి బడదాం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. పులి సంచారం బయటపడడంతో అటవీ అధికారులు పులి పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. అడ్డతీగల సబ్‌ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది, రెస్క్యూ బృందాలు దాని పాదముద్రలను అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. లక్కొండ, గొరగొమ్మి, బడదాం గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు సుబ్బారెడ్డి చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లవద్దన్నారు. అటవీ ప్రాంతాల్లో సంచరించడం వంటి పనులు చేయరాదన్నారు. పశువులను అడవులోకి తీసుకువెళ్లవద్దన్నారు. రాత్రి సమయాల్లో ఏ ఒక్కరూ బయటకు రావొద్దన్నారు. అటవీ సిబ్బంది గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పులి కదలికలు గుర్తించడానికి ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎటువంటి పశునష్టం జరిగినా అటవీశాఖ ద్వారా తగిన నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు.

శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం రాక

నల్లమలలోని శ్రీశైలం ప్రాంతం నుంచి ప్రత్యేక బృందం పులి అడుగుజాడలు కనిపెట్టడానికి సూదికొండ అటవీక్షేత్ర సిబ్బందితో కలసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రజల సమాచారం క్రోడీకరించుకుని తగిన జాగ్రత్తలు సూచిస్తూ పులి సంచారాన్ని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement