అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కవయిత్రి సబ్బెళ్ల వెంకట మహాలక్ష్మి నేషనల్ వుమెన్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక, సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహాలక్ష్మికి వుమెన్ ఎక్స్‌లెన్స్ అవార్డు (మహిళా కీర్తి రత్న)ను శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్, మహిళా శిల్పి బి.దేవికా రాణి వుడయార్ తదితరులు అందజేశారు. సాహితీ రంగంలో మహాలక్ష్మి చేస్తున్న సేవలకు ఈ గుర్తింపు దక్కింది. ఆమెను జిల్లాకు చెందిన పలువురు సాహితీ వేత్తలు, కవులు, రచయితలు అభినందించారు.
అక్రమ అరెస్టులు దారుణం
అమలాపురం టౌన్: అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, వారిని అక్రమంగా అరెస్టు చేస్తారా అని అమలాపురానికి చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.సత్తిబాబు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం అమలాపురంలో ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం చంద్రబాబు తీరుకు అద్దం పడుతోందన్నారు. ఇలాంటి వాటితో ఉద్యమాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా కనీసం వేతనం లేకుండా పనిచేస్తున్న అంగన్‌వాడీలను కార్మికులగా గుర్తించలేదని, వారి వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
‘నేను క్షేమం..
కంగారు పడొద్దు’
సఖినేటిపల్లి: నేను క్షేమం.. కంగారు పడొద్దు అంటూ బెహ్రయిన్‌లో యుద్ధ కారణంగా చిక్కుకున్న సఖినేటిపల్లికి చెందిన నల్లి స్టీఫెన్ బాబ్జీ బుధవారం సోషల్ మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. యద్ధం ప్రారంభమయ్యే నాటికి బెహ్రయిన్‌లోని ఆల్ ఘర్బి అనే ప్రాంతంలో ఉన్నానని, ఆ ప్రాంతంపై ఇరాన్ క్షిపణిలతో దాడి చేసిందన్నారు. దీంతో తనతో పాటూ అక్కడే ఉన్న పలు దేశాలకు చెందిన మరో 70 మందిని సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలించారన్నారు. యుద్ధం కారణంగా బెహ్రయిన్ ఎయిర్ పోర్టు బంద్ కావడంతో, తమను సౌదీ అరేబియా మీదుగా ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
365 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాల్లో బుధవారం ద్వితీయ సంవత్సరం జనరల్ రెగ్యులర్ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ –ఎ 2, సివిక్స్ పేపర్ –2, ఒకేషనల్ విద్యార్థులకు గ్రూప్ సబెక్టుల్లో పరీక్షలు జరిగాయి. ఏ కేంద్రంలోనూ మాల్ ప్రాక్టీస్ జరగలేదని, కేసులు నమోదు కాలేదని డీఐఈవో కె.చంద్రశేఖర్ బాబు తెలిపారు. జిల్లాలో 10,405 మంది విద్యార్థులకు 10,040 మంది హాజరయ్యారన్నారు.
క్రీడలతో ఆరోగ్యకర జీవన శైలి
అమలాపురం రూరల్: క్రీడలతో ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి ఆధ్వర్యంలో కోనసీమ హెల్త్ వారియర్స్ స్పోర్డ్స్ మీట్ 2026 పేరుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందితో గత నెల 15, 16 అంబాజీపేట కేంద్రంగా నిర్వహించిన క్రికెట్ పోటీలు, అలాగే గత నెల 21, 22 తేదీల్లో అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బుధవారం కలెక్టరేట్‌లో బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య సేవలు సమన్వయ అధికారి డాక్టర్ కె.కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


